Shah Rukh Khan: షారుఖ్ ఖాన్… ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన హీరో. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాలు సృష్టించిన రికార్డ్స్ మరొక హీరో చేరుకోలేనివి. అమితాబ్ వంటి లెజెండ్ ని వెనక్కి నెట్టి నెంబర్ వన్ రేసులోకి దూసుకొచ్చాడు. 90లలో మొదలైన షారుఖ్ ఖాన్ హవా ఇంకా కొనసాగుతుంది. వీటన్నింటికీ మించి ప్రపంచంలోనే అత్యంత ధనంతుడైన హీరోల్లో ఒకరు. 2024 లెక్కల ప్రకారం షారుఖ్ ఖాన్ ఆస్తుల నికర విలువ $ 760 మిలియన్స్. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 6.3 వేల కోట్లు.
అలాంటి షారుఖ్ ఖాన్ తన కారు ఈఎంఐ కట్టలేకపోయాడు అంటే నమ్ముతారా?… కానీ ఇది నిజం. ఢిల్లీకి చెందిన షారుఖ్ ఖాన్ హీరో కావాలని ముంబై వచ్చాడు. అతడికి ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. పరిశ్రమలో ఎవరూ తెలియదు. పెద్దగా స్థితిమంతుడు కూడా కాదు. కేవలం ప్రతిభను నమ్ముకుని పరిశ్రమలో అడుగుపెట్టాడు. బాలీవుడ్ లో ఒక అవుట్ సైడర్ ఎదగడం అంత సులభం కాదు. తొక్కి పడేస్తారు. అన్ని అవరోధాలు అధిగమించి షారుఖ్ స్టార్ అయ్యాడు.
తొలినాళ్లలో షారుఖ్ జీవితం ఎలా ఉండేదో ఆయనతో కలిసి సినిమాలు చేసిన జూహీ చావ్లా బయటపెట్టారు. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న జూహీ చావ్లా మాట్లాడుతూ… ”ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. తలదాచుకునేందుకు ముంబైలో షారుఖ్ కి ఇల్లు లేదు. ఢిల్లీ వెళ్లి వస్తూ ఉండేవాడు. ముంబైలో అతడికి వండి పెట్టేవాళ్ళు కూడా లేరు. ఎక్కడ ఉండేవాడో తెలియదు. సెట్స్ లో యూనిట్ వాళ్లతో తినేవాడు. టీ తాగేవాడు. వాళ్లతో నవ్వుతూ, మాట్లాడుతూ మమేకం అయ్యేవాడు. అతనికి ఒకే ఒక కార్ ఉండేది. అది బ్లాక్ కలర్ జిప్సీ.
నేను-షారుఖ్ కలిసి ‘రాజు బన్ గయా జెంటిల్ మెన్’, దిల్ ఆష్నా హై చిత్రాలు చేస్తున్నాము. మరొక చిత్రం దివ్య భారతితో చేస్తున్నాడు. రోజుకు మూడు షిఫ్ట్ లు, 24 గంటలు పని చేసేవాడు. కారణం తెలియదు షారుఖ్ ఖాన్ తన కార్ ఈఎంఐ లు కట్టలేకపోయాడు. దాంతో బ్యాంకు వాళ్ళు కారు తీసుకెళ్లిపోయారు. సెట్స్ కి దిగులుగా వచ్చాడు. తన వద్ద ఉన్న ఒక్క కారు కూడా తీసుకుపోయారని షారుఖ్ ఖాన్ చెప్పాడు. బాధపడకు భవిష్యత్తులో నువ్వు చాలా కార్లు కొంటావు అని నేను అన్నాను.
నా మాటలు ఆయనకు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఏ స్థాయిలో ఉన్నారో మనకు తెలుసు” అన్నారు. జూహీ చావ్లా సెన్సషనల్ వీడియో వైరల్ అవుతుంది. షారుఖ్ ఖాన్-జూహీ చావ్లా కాంబోలో వచ్చిన రాజు బన్ గయా జెంటిల్‌మన్, యస్ బాస్, డర్, ఫిర్ భీ దిల్ హై హిందుస్థానీ మంచి విజయాలు సాధించాయి.