రేపు(మే 28)న విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి. ప్రతీయేటా ఆయన జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకొని నివాళులర్పిస్తుంటారు. అయితే ఈసారి లాక్డౌన్ కారణంగా ఎన్టీఆర్ మనవాళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ రామ్ లు ఆయనకు ఇంటి వద్దే నివాళ్లులు అర్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో గురువారం ఎన్టీఆర్ ఘాట్ కు ఈసారికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రముఖ పీఆర్వో, నిర్మాత మహేష్ కొనేరు ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ లు ఈసారి ఎన్టీఆర్ ఘాట్‌కు రావడంలేదని.. ఇంట్లోనే ఆయనకు నివాళ్లులు అర్పిస్తారని ట్విటర్లో ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతం రెడ్ జోన్లో ఉంది. దీంతోనే ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్ జోన్లో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో గుంపులు గుంపులుగా తిరగకూడదు.. భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ ఘాట్ కు వస్తున్నారనే తెలిస్తే నందమూరి ఫ్యాన్స్ పెద్దఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించబడుతాయి. అంతేకాకుండా చైనా వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందుకు వారిద్దరి అభిమానుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారికి ఎన్టీఆర్ కు కుటుంబ సభ్యులు, అభిమానులు ఎవరి ఇళ్లలో వారే ఉంటూ నివాళ్లులు అర్పించనున్నట్లు తెలుస్తోంది.