
జీవితంలో ‘ఫస్ట్’ అనేది ఎప్పటికీ బెస్టే. ఏ విషయంలోనైనా.. ఎవరి విషయంలోనైనా.. ఇది ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సినిమా హీరోల విషయంలో మొదటి సినిమా అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక, ఆ సినిమా కు తీసుకున్న రెమ్యునరేషన్ మరింత స్పెషల్ గా ఉంటుంది. కొంతమంది రెమ్యునరేషన్ గా వచ్చిన చెక్కును ఎప్పటికీ క్యాష్ గా మార్చుకోకుండా.. ఇంట్లో దాచుకున్నవారు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. మరి, ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన జూనియర్ మొదటి సినిమాకు ఎంత తీసుకున్నాడు? ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఎంత తీసుకుంటున్నాడు? అన్నది చూద్దాం.
‘నిన్ను చూడాలని’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు జూనియర్. రామోజీరావు నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే.. ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయినప్పటికీ.. లైట్ తీసుకున్న తారక్ ముందుకు సాగాడు. ఆ విధంగా స్టూడెంట్ నంబర్ 1 తో మొదటి సక్సెస్ అందుకొని.. టాప్ స్టార్ గా ఎదిగాడు.
అయితే.. రెమ్యునరేషన్ విషయంలో మిగిలిన అగ్రహీరోలతో పోలిస్తే.. తక్కువగానే తీసుకుంటూ వచ్చాడు జూనియర్. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మాత్రం భారీగానే తీసుకున్నట్టు సమాచారం. కరోనా పుణ్యామాని దాదాపు మూడేళ్లుగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ చిత్రానికి గానూ తారక్ 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్. ఇక, రాబోయే చిత్రాలకు సైతం ఈ రేంజ్ లోనే పారితోషిక తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
జక్కన్న చిత్రం తర్వాత వెంటనే కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు జూనియర్. ఈ చిత్రం ఎన్టీఆర్ 30వ సినిమా కావడంతో.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తోనూ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలకు ఆర్ ఆర్ ఆర్ పారితోషికాన్ని మెయింటెయిన్ చేయబోతున్నట్టు వినికిడి.
ఈ విధంగా.. ప్రస్తుతం 60 కోట్ల రెమ్యునరేషన్ మీద కూర్చున్న జూనియర్.. తన మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ చిత్రానికి చాలా తక్కువ మొత్తం తీసుకున్నాడు. ఈ చిత్రానికి గానూ 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు జూనియర్. అయితే.. అప్పుడు అంత డబ్బు ఏం చేసుకోవాలోకూడా తెలియలేదని చెప్పాడు తారక్. ఆ మొత్తాన్ని తన తల్లికే ఇచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మొత్తానికి 4 లక్షల నుంచి 40 కోట్లు దాటుకొని 60 కోట్లకు ఎదిగాడు జూనియర్.