
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రావాల్సిన సినిమా అర్ధంతరంగా వాయిదా పడిపోవడం.. ఉన్నఫలంగా కొరటాల శివ లైన్లోకి రావడం.. ఎన్టీఆర్-30ని అఫీషియల్ గా ప్రకటించేయడం.. చకచకా జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్ మెంట్ తో.. టీకప్పులో తుఫాను వంటి సమస్య చల్లారిపోయింది. అయితే.. వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలన్న ఆత్రమో ఏమోకానీ.. అసలైంది లేకుండానే అనౌన్స్ మెంట్ ఇచ్చేసిందట యూనిట్.
అదే కథ! అవును.. ఈ సినిమాకు సంబంధించిన కథ ఇదీ అని అనుకోకుండానే జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. మేకర్స్ ప్రకటించేయడం జరిగిపోయాయట! ‘ఆచార్య’ నుంచి ఫ్రీ అయ్యాక తీరిగ్గా కథమీద కూర్చోబోతున్నాడట కొరటాల. అయితే.. తన వద్ద స్టోరీ బ్యాంక్ చాలానే ఉందని గతంలో చెప్పి ఉన్నాడీ దర్శకుడు. ఆ బ్యాంక్ లో కొన్ని స్టోరీలు ఖాళీ అయ్యాయి. కొన్ని ఉన్నాయి. అయితే.. అందులో జూనియర్ కు తగిన కథ లేదన్నది ప్రధాన విషయం.
మహేష్, ప్రభాస్ కోసం అనుకున్న ఓ రెండు కథలు అండర్ లైన్ చేసి ఉన్నాయట. వాటిలో ఒక దాన్ని తారక్ కోసం మార్పులు చేస్తాడని అంటున్నారు. బేసిగ్గా రచయిత కాబట్టి కొరటాలకు అదేమంత కష్టమయ్యే పనికాదు. ఈ కారణం చేత.. గతంలో జనతా గ్యారేజ్ వంటి హిట్ ఇచ్చి ఉండడం చేత.. త్రివిక్రమ్ మూవీ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలనే ఆలోచన చేత.. కథ వినకుండానే కొరటాలకు ఓకే చెప్పాడట ఎన్టీఆర్.
ఇదిలాఉంటే.. కొరటాల-ఎన్టీఆర్ సినిమా కథ ఇదేనంటూ ఓ లైన్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. హిమాలయాల నుంచి నగరానికి వచ్చిన అమాయకపు యువకుడి పాత్రలో జూనియర్ కనిపించబోతున్నారనే గాసిప్ బయటకు వచ్చింది. కల్లాకపటం తెలియని చిన్నపిల్లాడి మనస్త్వం గల క్యారెక్టర్ లో నటిస్తున్నాడనే వార్త రౌండ్లు వేస్తోంది. మరి, ఇందులో వాస్తవం ఎంత? కొరటాల ఎలాంటి కథను సిద్ధం చేయబోతున్నాడు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.