Johnny Master and Pawan Kalyan : జాతీయ స్థాయిలో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న జానీ మాస్టర్, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అవ్వడం, ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ సినిమాలు చేయడానికి సిద్ధం అవ్వడం వంటివి మనమంతా చూస్తూనే ఉన్నాం. పలు హిందీ సినిమాలకు కొరియోగ్రఫీ చేసేందుకు సంతకం చేసిన ఆయన, రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా పలు పాటలకు కొరియోగ్రఫీ అందించబోతున్నాడు. అలా మళ్ళీ ఆయన తన కెరీర్ లో నెమ్మదిగా బిజీ అవుతున్నాడు. 2022 వ సంవత్సరం లాక్ డౌన్ తర్వాత జానీ మాస్టర్ ‘గేమ్ చేంజర్’ చిత్రం ‘డోప్’ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసాడు. రీసెంట్ గానే విడుదలైన ఈ సాంగ్ కి ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ కి ఎందుకు నేషనల్ అవార్డు వచ్చిందో మరోసారి ఆయన తన టాలెంట్ తో అందరికీ అర్థమయ్యేలా చేసాడు.
ఇదంతా పక్కన పెడితే బైలు నుండి బయటకి వచ్చిన తర్వాత రీసెంట్ గానే ఆయన ఒక ప్రముఖ పాపులర్ విలేఖరి కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆ విలేఖరి అడిగిన పలు ప్రశ్నలకు జానీ మాస్టర్ చాలా సూటిగా సమాదానాలు చెప్పాడు. ముఖ్యంగా జానీ మాస్టర్ పై కేసు నమోదైన వెంటనే పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అలా చేసినప్పుడు మీకు బాధ కలిగిందా? అసలు మీ రియాక్షన్ ఏమిటి అని అడగగా , దానికి జానీ మాస్టర్ సమాధానం ఇస్తూ ‘కళ్యాణ్ అన్నయ్య నన్ను సస్పెండ్ చేసి చాలా మంచి పని చేసాడు. ఎందుకంటే నేను కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ ని అయితే, ఆయన స్థానంలో అదే పని చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత జానీ మాస్టర్ భార్య సుమలత మాట్లాడుతూ ‘బాధ వేస్తుందా అని అడిగితే కచ్చితంగా వేస్తుంది. వేయలేదు అని చెప్తే దానిని ఎవ్వరూ నమ్మరు. కాకపోతే ఉన్న రాజకీయ పరిస్థితిలో కళ్యాణ్ గారు అలా చేయడం లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ప్రత్యర్థులు చిన్న అవకాశం కోసం విమర్శలు చేయడానికి, పార్టీ పరువుని తీయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జానీ మాస్టర్ పై ఎలాంటి యాక్షన్ తీసుకొని ఉండకపోయుంటే, ఇలాంటోడిని పార్టీ లోకి తీసుకున్నారు. జనసేన పార్టీ అంటేనే అంత అంటూ విష ప్రచారం చేస్తారు. కళ్యాణ్ గారు మాత్రమే కాదు, ఆయన స్థానంలో ఎవరైనా అలాంటి నిర్ణయమే తీసుకుంటారు. కానీ జానీ మాస్టర్ ఎలాంటి వాడు అనేది కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి తెలుసు’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది. జానీ మాస్టర్ మరియు అతని భార్య స్పందించిన తీరుపై పవన్ కళ్యాణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇంటర్వ్యూ లో ఆయన తన జీవిత ద్యేయం సీఎం అవ్వడమే అని, కచ్చితంగా అవుతానని చెప్పుకొచ్చాడు.