Jayasudha: చిత్ర పరిశ్రమలో అనిశ్చితి ఎక్కువ. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరి స్టార్డం శాశ్వతం కాదు. నటిస్తేనే డబ్బులు. లేదంటే రూపాయి సంపాదన ఉండదు. అందుకే శోభన్ బాబు తాను ఆర్జించిన ప్రతి రూపాయిని జాగ్రత్త చేసేవారట. దాన్ని పెట్టుబడిగా మార్చేవారట. ముఖ్యంగా భూమికి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే ఎప్పటికైనా లాభాలు వస్తాయని భావించేవారట.
అలా ఆరోజుల్లో చెన్నై పరిసర ప్రాంతాల్లో అనేక భూములు కొనుగోలు చేశారట. ఒకప్పుడు ఎలాంటి విలువ లేని ఆ భూములు భవిష్యత్ లో కోట్ల రూపాయలు పలికాయట. తన తోటి నటులకు కూడా ఈ విషయంలో శోభన్ బాబు సలహాలు ఇచ్చేవారట. కాగా హీరోయిన్ జయసుధకు శోభన్ బాబు విలువైన సలహా ఇవ్వగా.. ఆమె వినలేదట. దాని వలన ఆమె భారీ మూల్యం చెల్లించిందట.
ఒకరోజు షూటింగ్ కోసం కారులో శోభన్ బాబు, జయసుధ వెళుతున్నారట. అప్పుడు శోభన్ బాబు.. ఏమోయ్, నీకు ఓ స్థలం చూపిస్తాను. మీ ఇంట్లో చెప్పి దాన్ని కొనుక్కో అన్నారట. అనంతరం భర్తతో పాటు జయసుధ ఆ ప్లేస్ కి వెళ్లిందట. చూస్తే అది ఒక డంపింగ్ యార్డ్ అట. ఇదేంటి శోభన్ బాబుకు ఏమైనా పిచ్చా, పోయి పోయి డంపింగ్ యార్డ్ దగ్గర స్థలం కొనమంటాడు, ఏంటి అని జయసుధ షాక్ అయ్యిందట.
ఈ స్థలం కొనమంటారు ఏంటండీ? అని శోభన్ బాబుతో జయసుధ అన్నారట. లేదు నా మాట విని ఈ స్థలం కొనుక్కో, ఇదంతా పూడ్చి కమర్షియల్ ఏరియా చేయబోతున్నారని శోభన్ బాబు అన్నారట. ఏది ఏమైనా డంపింగ్ యార్డ్ కొనడం ఇష్టం లేక, జయసుధ శోభన్ బాబు సలహాను పాటించలేదట. కట్ చేస్తే కొన్నాళ్ళకు అది సిటీగా మారిపోయింది.
చెన్నైలో అత్యంత డిమాండ్ ఉన్న అన్నానగర్ గా అది మారిందని జయసుధ అన్నారు. అక్కడ ఎకరం కనీసం రూ. 100 కోట్లు ఉంటుందని జయసుధ ఓ సందర్భంలో ఈ విషయం చెప్పుకొచ్చారు.