Homeఎంటర్టైన్మెంట్జంధ్యాల గారి లో ఉన్న మరో గొప్పతనం ఇది !

జంధ్యాల గారి లో ఉన్న మరో గొప్పతనం ఇది !

Jandhyala: Another Great Thing About Jandhyala

Jandhyala:  “ఇద్దరు” సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ డైలాగ్స్ విన్నప్పుడు ఇంత గొప్పగా తెలుగును పలుకుతున్నారు ఎవరై ఉంటారు అంటూ గుమ్మడిగారికి డౌట్ వచ్చిందట. సహజంగా గుమ్మడిగారికి జగ్గయ్య గారి డబ్బింగ్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. కానీ ఎందుకో ఇద్దరు సినిమాలో సుదీర్ఘ కవితలను, డైలాగులను పలికిన విధానం ఎంతగానో ఆకటుకున్నాయి. పైగా ప్రకాష్ రాజ్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన పాత్ర.

ఇంతకీ ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరూ అని ఆరా తీస్తే.. ద గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ జంధ్యాలగారు డబ్బింగ్ చెప్పారని తెలిసింది. మీకు తెలుసా ? జంధ్యాలగారు చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. “భారతీయుడు” సినిమాలో పోలీసాఫీసర్ నెడుముడి వేణు పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పారట.

“అరుణాచలం” సినిమాలో రంభ తండ్రి, పెద్ద రజనీకాంత్ (సింహాచలం) మేనేజరుగా విసు పోషించిన పాత్ర గుర్తుందా? ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిందీ జంధ్యాలే. “భామనే సత్యభామనే” సినిమాలో మీనా తండ్రి పాత్ర, రుక్మిణిని ప్రేమించే ముసలాయన పాత్ర గుర్తుందా? జెమినీ గణేషన్ పోషించాడు ఆ పాత్ర. దానికి డబ్బింగ్ చెప్పింది కూడా జంధ్యాల గారే.

సుత్తి వీరభద్రరావుకు డబ్బింగ్ చెప్పింది ఒక బాధాకరమైన సందర్భం. “చూపులు కలసిన శుభవేళ” సినిమాలో సుత్తి వీరభద్రరావు పోషించిన గుండు పాండురంగారావు పాత్ర తెలుసు కదా. “అలా నడుస్తూ మాట్లాడుకుందాం పదా” అని పిలిచి కిలోమీటర్లకు కిలోమీటర్లు నడిపించి, చివరకు “ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఆఫీసుకొచ్చి కనబడు” అనేసి కారు ఎక్కి చక్కాపోతూంటాడు కదా.

దురదృష్టవశాత్తూ సుత్తి వీరభద్రరావు హఠాత్తుగా మరణించడంతో ఆ పాత్రకు డబ్బింగ్ జంధ్యాల గారే చెప్పారు. గొప్పదనం ఏమిటంటే ఈ విషయం మనం సినిమా గురించి తెలుసుకున్నప్పుడు తెలుస్తుందే తప్ప చూస్తున్నప్పుడు తెలియదు. ఎస్టాబ్లిష్డ్ కమేడియన్, గొప్ప నటుడు అయిన ఒక వ్యక్తికి ఫుల్ లెంగ్త్ పాత్ర ఉన్నప్పుడు, అంత అతికినట్టు సరిపోయేలా వేరొకరు డబ్బింగ్ చెప్పడం అంటే సామాన్యం కాదు. కానీ జంధ్యాల చాలా సహజంగా డబ్బింగ్ చెప్పారు. జంధ్యాలగారిలో ఉన్న మరో గొప్పతనం ఇది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version