Vishnu Kumar Raju: ఏపీలో బిజెపికి ప్రాతినిధ్యం పెరిగింది. గత ఐదేళ్లలో ఒక్క సీటు కూడా ఆ పార్టీకి లేదు. ఇప్పుడు మాత్రం అసెంబ్లీలో 8 స్థానాలు, పార్లమెంట్లో మూడు స్థానాలు ఆ పార్టీ చేతిలో ఉన్నాయి. కానీ పెరిగిన బలానికి అనుగుణంగా తమకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు అన్నది బిజెపి నేతల బాధ. ఇదే విషయాన్ని తాజాగా బయటపెట్టారు విశాఖపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఎక్కడైనా సీట్లు పెరిగితే పదవులు వస్తాయి. ‘ఏపీలో బిజెపికి బలం పెరిగినా.. పదవులు రాకపోగా తగ్గిపోయాయి’.. అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే తాజాగా జనసేనకు నాలుగో మంత్రి పదవి దక్కనుంది. మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు విష్ణు కుమార్ కామెంట్స్ దానిపైనేనని టాక్ నడుస్తోంది.
* మంత్రి పదవుల పంపకం
8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బిజెపికి రాష్ట్ర మంత్రివర్గంలో ఒక పదవి ఇచ్చారు. సత్య కుమార్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చారు. అలాగే 21 అసెంబ్లీ సీట్లు ఉన్న జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కు కీలకమైన ఆరు శాఖలను అప్పగించారు. కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖ కట్టబెట్టారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను ఇచ్చారు. ఇప్పుడు తాజాగా నాగబాబును తీసుకోనున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనే ఫార్ములాను అప్పట్లో అమలు చేశారు. ఆ లెక్కనే జనసేనకు మూడు, బిజెపికి ఒక మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే జనసేనకు మరో మంత్రి పదవి కేటాయిస్తున్నారు. బిజెపి ఆగ్రహానికి కారణం అదే.
* సీనియర్ నేతగా గుర్తింపు
ప్రస్తుతం బిజెపి శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు ఉన్నారు. 2014లో కూడా ఆయనే శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఆది నుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఉండేవారు. అయితే ఈసారి తనకు మంత్రి పదవి ఖాయమని ఆశలు పెట్టుకున్నారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా విష్ణుకుమార్ రాజుకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనుండడంతో తాను ఒకడిని ఉన్నానని గుర్తు చేసేలా మాట్లాడుతున్నారు విష్ణుకుమార్ రాజు. అందుకే ఈ సంచలన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే నాగబాబుకు మంత్రి పదవి.. బిజెపిలో కొత్త అసంతృప్తికి కారణమవుతోంది. ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.