Balakrishna: నందమూరి బాలకృష్ణ.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. నందమూరి తారక రామారావు కుమారుడిగా, తెలుగు చిత్ర కథానాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా, హిందూపురం ఎమ్మెల్యేగా.. ఇలాబహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు నందమూరి బాలకృష్ణ. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర చూపించుకున్నారు. దాదాపు 110 చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది తన 50 ఏళ్ల సినీ జీవితాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. బసవతారకం ఆసుపత్రి చైర్మన్గా రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. మరోవైపు అన్ స్టాపబుల్ పేరిట చేస్తున్న షో తెలుగు నాట ఎంతో సుపరిచితం అయింది. దేశంలోనే అత్యుత్తమ టీవీ షో గా నిలిచింది. ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. పద్మభూషణ్ అవార్డుకు నామినేట్ చేసింది.
* ఎంపిక ప్రక్రియ ప్రారంభం
సాధారణంగా పద్మ అవార్డుల ప్రక్రియ నవంబర్లో ప్రారంభమవుతుంది. డిసెంబర్లో ఫైనల్ చేస్తారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేళ పద్మ అవార్డుల జాబితా ప్రకటిస్తారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బాలకృష్ణతో పాటు మరో సీనియర్ హీరో పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. 2007లో మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. గత ఏడాది పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు చిరంజీవి. ఆయనతో సమకాలీకుడు అయిన బాలయ్యకు కూడా పద్మా అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. వచ్చే ఏడాది బాలకృష్ణకు ప్రకటించే అవకాశం ఉంది.
* రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు
ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో సైతం బిజెపి అధికారాన్ని పంచుకుంటుంది. ఈ తరుణంలో బాలకృష్ణకు తప్పకుండా పద్మ అవార్డు వరిస్తుందని తెలుస్తోంది. చంద్రబాబు సిఫార్సులకు కేంద్రం పెద్దపీట వేస్తున్న వేళ.. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దాదాపు ఖాయమైనట్టేనని ప్రచారం సాగుతోంది. మొన్నటికి మొన్న బాలయ్య 50 సంవత్సరాల సినీ జీవితంపై ప్రత్యేక వేడుక జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. బాలకృష్ణ పద్మ భూషణ్ కు ఎంపిక అయితే మరో ఈవెంట్ కు నందమూరి అభిమానులు సిద్ధమవుతారు. మరో రెండు నెలలు ఆగితే దీనిపై ఫుల్ క్లారిటీ వస్తుంది.