https://oktelugu.com/

Adani Group : అదానీ స్కాంలో జగన్ ప్రస్తావన.. అమెరికా దర్యాప్తు సంస్థ చెబుతోంది అదే

గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏపీలో అదానీ గ్రూపునకు ఎనలేని ప్రాధాన్యం దక్కింది. ఏపీ విషయంలో చాలా ఉదారంగా ఉండేది అదానీ గ్రూప్. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేది. అయితే ఆ డీల్స్ వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ గుర్తించడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : November 22, 2024 / 10:49 AM IST

    Adani Group-YS Jagan

    Follow us on

    Adani Group :  అదానీపై అమెరికాలో నమోదైన అవినీతి కేసుల్లో సరికొత్త కోణాలు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. వ్యాపార ఒప్పందాల్లో భాగంగా అదాని ఇండియాలో చాలా రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్లు తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సెకీ సంస్థతో ఒప్పందానికి సంబంధించి ప్రముఖంగా జగన్ ప్రభుత్వం పేరు వినిపిస్తోంది. భారత్లో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూప్ వేరువేరు రాష్ట్రాల సీఎంలకు రూ.2029 కోట్లు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏపీ, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, చత్తీస్గడ్, ఒడిశాలో ఒప్పందాలకులంచం ఇచ్చినట్లు పేర్కొంది. గత ఐదేళ్లుగా ఏపీలో ప్రభుత్వ అధినేతకు 1750 కోట్లు లంచం ఇచ్చినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఒప్పందాలకు 279 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. 2021లో అదాని వ్యక్తిగతంగా జగన్ తో భేటీ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జగన్ తో భేటీ తర్వాత డీల్ కుదిరినట్లు బ్రూక్లిన్ కోర్టు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

    * ఆ స్కాంలోనే ప్రధానంగా
    ప్రధానంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో జరిగిన ఒప్పందం స్కామ్ లో జగన్ సర్కార్ పేరు వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నట్లు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణల్లో ఉంది. రూ. 2.49కు యూనిట్ చొప్పున 2.4 గిగావాట్ల కొనుగోలుకు 25 ఏళ్లపాటు వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అదే సమయంలో గుజరాత్ కేవలం రూ. 1.99కే సెకీ ద్వారా విక్రయించేందుకు అదాని పవర్ కుదుర్చుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ చార్జిషీట్లో పేర్కొన్నట్లు సమాచారం.

    * జగన్ ను వెంటాడుతున్న కష్టాలు
    ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ రాజకీయపరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఆరు నెలల కిందట అధికారానికి దూరమయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వెంటాడుతోంది. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోంది. అరెస్టులు సైతం కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆదానీ అవినీతి కేసు జగన్ మెడకు చుట్టుకుంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఇబ్బందులు చాలా అన్నట్టు.. కొత్తవి వస్తే తప్పకుండా పార్టీ మునుగడ పై ప్రభావం చూపడం ఖాయమని టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.