Regina : సినీ ఇండస్ట్రీ లో అందంతో పాటు టాలెంట్ ఉన్నటువంటి హీరోయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఆ తక్కువ మందిలో ఒకరు రెజీనా. ఈమె కెరీర్ చిన్న చిన్న క్యారెక్టర్స్ తోనే మొదలైంది. ఆ తర్వాత హీరోయిన్ గా తమిళంలో పలు సినిమాలు చేసింది. తెలుగు లో ఈమె సుధీర్ బాబు మొదటి సినిమా ‘శివ మనసులో శృతి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వకపోయినా, రెజినా కి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చింది. 2014 లో ఈమె అల్లు శిరీష్ తో కలిసి నటించిన కొత్త జంట చిత్రం హిట్ అయ్యింది. అక్కడి నుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సినిమాలు చేస్తూ మీడియం రేంజ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకుంది.
ఇది వరకు కేవలం మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో చేస్తూ వచ్చిన రెజీనా, తొలిసారి అజిత్ లాంటి స్టార్ హీరో సినిమాలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం దక్కింది. ఆయన హీరో గా నటించిన ‘విడాముచార్చీ’ అనే చిత్రం జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా, రెజీనా విలన్ గా నటించింది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్న ఆమె, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘మా అమ్మానాన్నలది ప్రేమ వివాహం. మా అమ్మ క్రిస్టియన్ కాగా, మా నాన్న ముస్లిం. దీంతో నేను ముస్లిం గానే మొదట్లో పెరిగాను. కానీ నాకు ఆరేళ్ళ వయస్సు ఉన్నప్పుడు మా అమ్మానాన్న విడిపోయారు. దీంతో మా అమ్మ నన్ను ఇస్లాం మతం నుండి క్రిస్టియన్ కి కన్వర్ట్ చేసి, నా పేరు వెనుక ‘కసాండ్రా’ అని పెట్టింది. అప్పటి నుండి నేను బాప్టిజం అందుకొని, బైబిల్ చదివాను’ అంటూ చెప్పుకొచ్చింది.
తనకి మతాల పట్ల పట్టింపు లేదని, మస్జీద్, చర్చి, గుడి కి తరచూ వెళ్తానని చెప్పుకొచ్చింది. ఇక రెజీనా సినిమాల విషయానికి వస్తే ఈమె హీరోయిన్ రోల్స్ కి దూరంగా,ఈమధ్య ఎక్కువగా విలన్ రోల్స్ లోనే కనిపిస్తుంది. 7 , ఎవరు, చక్ర వంటి సినిమాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె, ఇప్పుడు ‘విడాముయార్చి’ తో మరోసారి విలన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అజిత్ లాంటి సూపర్ స్టార్ సినిమా కాబట్టి, హిట్ అయితే కచ్చితంగా రెజీనా కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఈ సినిమాతో పాటు ఆమె ‘జాట్’, ‘సెక్షన్ 108 ‘, ‘ఫ్లాష్ బ్యాక్’ వంటి చిత్రాల్లో నటిస్తుంది. హీరోయిన్ గా కాకపోయినా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ, క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతుంది రెజీనా కాసాండ్రా.