Tammineni Seetharam : మాజీ స్పీకర్ తమ్మినేని మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన కుటుంబంతో సహా జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తోంది. టిడిపిలో ఒక వెలుగు వెలిగిన తమ్మినేని సీతారాం రాజకీయంగా తప్పటడుగులు వేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అటు తరువాత మళ్లీ టీడీపీలోకి వచ్చారు. చేసిన తప్పుకు క్షమించాలని అడిగారు. తాను ఎట్టి పరిస్థితుల్లో మరోసారి తెలుగుదేశం పార్టీని వీడనని.. తాను చనిపోయినా.. గౌరవపూర్వకంగా టిడిపి జెండా కప్పాలని కోరారు. కానీ అక్కడకు కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మరోసారి పోటీ చేసి జగన్ ప్రభంజనంలో గెలిచారు. 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. దీంతో మీ సేవలు చాలు అంటూ జగన్ ఆయనను పక్కకు తప్పించారు. ద్వితీయ శ్రేణి నాయకుడికి ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు తమ్మినేని. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఇన్చార్జిగా నియమితులైన యువనేత తన పని తాను చేసుకుంటున్నారు. కనీసం పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని జగన్ అడగడం లేదు. దీంతో తమ్మినేని కుటుంబం జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ పవన్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పోయాయి.
* నాలుగు పీకినా జనసేనలో చేరరట
ప్రస్తుతం తమ్మినేని సీతారాం తీవ్ర ప్రస్టేషన్లో ఉన్నారు. జనసేనలో చేరుతారా అని విలేకరులు ప్రశ్నిస్తే.. తనను 4 పీకినా జనసేనలో ఎందుకు చేరుతానంటూ సెటైర్లు వేశారు. దీంతో తమ్మినేని విషయంలో ఏదో తేడా కొడుతోంది అన్న అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో టిడిపిలో కొనసాగుతానని చెప్పడానికి.. తాను చనిపోయినా పార్టీ జెండా కప్పాలని కోరారని.. ఇప్పుడు పవన్ విషయంలో ఇలా మాట్లాడుతున్నారు అని శ్రీకాకుళం జిల్లా ప్రజలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి అనుమతి రాకపోవడంతోనే ఇలా వ్యాఖ్యానిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* జూనియర్ కు ఇన్చార్జ్ బాధ్యతలు
తమ్మినేని తన పెద్దరికాన్ని నిలబెట్టుకోలేకపోయారు. హుందాగా ప్రవర్తించలేకపోయారు. అదే జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం తన పెద్దరికాన్ని కొంతవరకు కాపాడుకోగలిగారు. వ్యక్తిగత అంశాలకు కానీ.. వివాదాస్పద అంశాల జోలికి గానీ ఎన్నడూ పోలేదు. అందుకే ఆయన విషయంలో జగన్ ఒక ఆలోచనతో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోయినా ధర్మాన స్థానంలో మరొకరిని నియమించలేదు. తనను తప్పిస్తే కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలని తమ్మినేని కోరినా.. జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. గతంలో తమ్మినేనిని వ్యతిరేకించిన ఒక యువ నేతను తీసుకొచ్చి ఇన్చార్జిని చేశారు. అందుకే జీర్ణించుకోలేకపోతున్నారు తమ్మినేని. పోనీ జనసేనలోకి వస్తామంటే పవన్ నుంచి ఎటువంటి కదలిక లేదు. అందుకే తనకు నచ్చిన సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు తమ్మినేని.