Anushka Shetty
Anushka Shetty : టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అశేషమైన ఆదరణ ఉన్న హీరోయిన్ గా అనుష్క శెట్టి(Anushka Shetty) పేరుని చెప్పొచ్చు. యూత్ ఆడియన్స్ ఈమె అందానికి మెంటలెక్కిపోతారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈమె నటనకు ముగ్దులు అవుతుంటారు, ఇక మాస్ ఆడియన్స్ అయితే ఈమె చేసే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్యూలు కట్టేస్తుంటారు. ఇలా అన్ని వర్గాల్లో సరిసమానమైన క్రేజ్ ఉంది కాబట్టే అనుష్క ని అందరు లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె సెకండ్ హీరోయిన్ రోల్ చేసినప్పటికీ కూడా ఆడియన్స్ మనసుల్ని కొల్లగొట్టింది. దర్శక నిర్మాతలను విశేషంగా ఆకర్షించింది. ‘విక్రమార్కుడు’ చిత్రం ఈమె కెరీర్ లో మొట్టమొదటి హిట్. ఆ సినిమా తర్వాత ఈమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
అయితే బాహుబలి సిరీస్ తర్వాత అనుష్క శెట్టి సినిమాలు చేసే సంఖ్య బాగా తగ్గించింది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ తన బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే అనుష్క శెట్టి ఒక టీవీ సీరియల్ లో నటించింది అనే విషయం ఎంత మందికి తెలుసు?, అప్పట్లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే యువ అనే టీవీ సీరియల్ పెద్ద హిట్ అయ్యింది. ఇందులో అనుష్క ఒక ఎపిసోడ్ లో తళుక్కున మెరిసింది. యాంకర్ రష్మీ(Anchor Rashmi), కరాటే కళ్యాణి, వాసు, కృష్ణుడు వంటి వారు ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలు పోషించారు. 2007 వ సంవత్సరం లో ప్రసారమైన ఈ టీవీ సీరియల్ లో రాజమౌళి(SS Rajamouli) కూడా ఒక ఎపిసోడ్ లో నటించాడు. రష్మీ తో ఆయన చేసిన ఒక రొమాంటిక్ సన్నివేశం నిన్న సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.
ఈ సీరియల్ లో అనుష్క వాసు కి ప్రేమికురాలిగా నటించింది. మూడు జంటల చుట్టూ తిరిగే ఈ సీరియల్ స్టోరీ చాలా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది. ఈ సీరియల్ కి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో అనుష్క నాగలక్ష్మి అనే పాత్రలో కనిపిస్తుంది. కేఫ్ లో మూడు జంటలు ఉన్నప్పుడు, వాసు తన ప్రేయసి నాగ లక్ష్మి ని పరిచయం చేస్తాడు. ఆమెని చూసి యాంకర్ రష్మీ మరియు ఇతర హీరోయిన్లు జలసీ ఫీల్ అవుతుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) తో కలిసి ఆమె ‘ఘాటీ'(Ghaati Movie) అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ఏప్రిల్ 25 న ఈ చిత్రం మన ముందుకు రాబోతుంది.