Junior NTR: తెలుగు రాష్ట్రాల తర్వాత సౌత్ లో టాలీవుడ్ చిత్రాలకు కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది. దాదాపు స్టార్ హీరోల చిత్రాలు అక్కడ మంచి వసూళ్ళు రాబడతాయి. ఇక్కడ హీరోలకు కర్ణాటకలో ఫ్యాన్ బేస్, అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అయితే కన్నడ ప్రేక్షకులకు ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. వారు ఆయన్ని తమలో ఒకడిగా భావిస్తారు. కన్నడ ప్రేక్షకులకు, పరిశ్రమకు ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం ఉంది. ఆ కారణంతోనే కన్నడ హీరోలు ఎన్టీఆర్ తో మంచి రిలేషన్స్ మైంటైన్ చేస్తారు. దివంగత పునీత్ రాజ్ కుమార్ తో ఎన్టీఆర్ కి అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆయన మూవీలో ఎన్టీఆర్ ఒక పాట పాడారు. తమన్ స్వరపరచిన ఆ పాట విపరీతంగా ఆదరణ దక్కించుకుంది.

ఎన్టీఆర్ కి కన్నడిగులు ఇచ్చే గౌరవం వేరని నిన్న జరిగిన కార్యక్రమం మరోసారి రుజువు చేసింది. నవంబర్ 1న జరిగిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకు ఎన్టీఆర్, రజినీకాంత్ లకు మాత్రమే ఆహ్వానం లభించింది. వీరిద్దరినే ఆహ్వానించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. రజినీకాంత్ అనే స్క్రీన్ నేమ్ తో వెలిగిపోయిన శివాజీ రావ్ గైక్వాడ్ కర్ణాటకకు చెందినవారే. ఆయన మైసూర్ లో పుట్టారు. హీరో కావాలని చెన్నైకి వెళ్లడం అక్కడ తిరుగులేని స్టార్ గా ఎదగడం జరిగింది.
మరి ఎన్టీఆర్ ని ఎందుకు పిలిచారంటే.. దానికి కూడా ఒక లోతైన కారణం ఉంది. ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటకకు చెందినవారే. ఉడుపి జిల్లా కుందపురంలో ఆమె పుట్టి పెరిగారు. వృతిరీత్యా టీచర్ అయిన షాలినిని హరికృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు. హరికృష్ణ-షాలినిల సంతానమే ఎన్టీఆర్. అమ్మ దగ్గర కన్నడ నేర్చుకున్న ఎన్టీఆర్ ఆ భాష అనర్గళంగా మాట్లాడగలరు. నిన్న జరిగిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ కన్నడ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. రజినీకాంత్ సైతం ఎన్టీఆర్ వాగ్ధాటికి ముగ్ధులయ్యారు.

పరాయిభాషపై ఇంత పట్టేంటని తెలియనివారు ఆశ్చర్యపోయారు. ఏక సంధాగ్రాహి అయిన ఎన్టీఆర్ అమ్మ షాలినీ వద్ద కన్నడ అవపోశపట్టారు. నిన్నటి ఎన్టీఆర్ స్పీచ్ కన్నడ దేశాన్ని ఊపేసింది. ఎన్టీఆర్ ని తమ కన్నడిగుడిగా చెప్పుకోవడానికి వారు గర్వపడుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తెలుగువాడు మాత్రమే కాదు కన్నడిగుడు కూడా అంటున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్టీఆర్ కి అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇకపై కన్నడ ప్రేక్షకులకు ఎన్టీఆర్ పై వల్లమాలిన అభిమానం ఏర్పడటం ఖాయం. ఆయన చిత్రాలు అక్కడ సంచనల విజయాలు అందుకోవడం అనివార్యం అనిపిస్తుంది.