Teja Sajja Rejected Jathi Ratnalu Movie: మన టాలీవుడ్ లో కామెడీ జానర్ సినిమాలకు ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ కి మన తెలుగు సినిమా ఎదిగిపోవడం తో మేకర్స్ స్టార్ హీరోలతో ఆ స్థాయి సినిమాలను తీసేందుకు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. హీరోలు కూడా అలాంటి సినిమాలకే పచ్చ జెండా ఊపుతున్నారు. ఆడియన్స్ లో కూడా అలాంటి ప్రాజెక్ట్స్ మీదనే ఆసక్తి ఉంది. దీంతో కమర్షియల్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది కానీ, కామెడీ జానర్ సినిమాలకు మాత్రం ఇసుమంత క్రేజ్ కూడా తగ్గలేదు. అందుకు ఉదాహరణ ‘జాతి రత్నాలు'(Jathi Ratnalu) అనే చిత్రం. టాలీవుడ్ లో ఒక సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది ఈ సినిమా. అనుదీప్ దర్శకత్వం లో నవీన్ పోలిశెట్టి హీరో గా నటించిన ఈ సినిమా 2021 వ సంవత్సరం లో విడుదలై, సంచలన విజయం సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.
అయితే ఈ సినిమాని ముందుగా నవీన్ పోలిశెట్టి(Naveen Polisetty) తో చెయ్యాలని అనుకోలేదట డైరెక్టర్ అనుదీప్. హనుమాన్ హీరో తేజ సజ్జ(Teja Sajja) తో చెయ్యాలని అనుకున్నాడట. ఈ నెల 12న తేజ సజ్జ హీరో గా నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే చెప్పాడు. ముందుగా యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ స్నేహితులందరితో కలిసి సినిమాలు చేస్తున్నారు, మరి మీ స్నేహితుడైన అనుదీప్ తో ఎప్పుడు చేయబోతున్నారు?’ అని అడగ్గా, దానికి తేజ సజ్జా సమాధానం చెప్తూ ‘అనుదీప్ తో పనిచేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కానీ అతను కథ ఎప్పుడు సరిగా చెప్పాడు. ఉదాహరణకు జాతి రత్నాలు సినిమా స్టోరీ ని ముందుగా నాకే చెప్పాడు’.
‘అందులో హీరో తన స్నేహితులతో ముందుగా జీన్స్ ప్యాంట్ ఎవరు వేసుకున్నారు అనే దానిపైన చర్చ మొదలు పెట్టి, ఆరోజు సాయంత్రం వరకు దాని గురించే వాదనలు వేసుకుంటూ ఉంటారు. ఆ సన్నివేశాన్ని థియేటర్ లో చూసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసాను. కానీ అనుదీప్ నాకు ఈ సన్నివేశాన్ని ఎలా చెప్పాడంటే, ముగ్గురు స్నేహితులు ఉంటారు మామ, వాళ్ళు జీన్స్ ప్యాంట్ ముందుగా ఎవరు వేసుకున్నారు అనే విషయం పై కొట్టుకుంటారు అని చెప్పాడు. దీనిని నేనేమి సమాధానం చెప్పేది. మనోడి స్టోరీ న్యారేషన్స్ అన్ని ఇలాగే ఉంటాయి. కానీ జాతి రత్నాలు సినిమా ఎవరికీ పడాలో వాళ్ళకే పడింది. ఆ సినిమా అంత పెద్ద రేంజ్ కి వెళ్లిందంటే అందుకు కారణం నవీన్ పోలిశెట్టి గారు. ఆ రేంజ్ లో నేను కామెడీ చెయ్యలేను’ అంటూ చెప్పుకొచ్చాడు తేజ సజ్జ.