Tandel : యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని మన తెలుగు లో ఇది వరకు ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. వాటికి మన ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య కాలం లో యదార్ధ సంఘటనల మీద పెద్దగా సినిమాలు రావ డం లేదు. మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరి ఫోకస్ పాన్ ఇండియన్ చిత్రాల మీదనే ఉండడంతో ఇటు వైపు ఆలోచించడం కాస్త తగ్గించారు. అయితే చాలా కాలం తర్వాత యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ప్రస్తుతం మామూలు రేంజ్ లో లేవు. మరో ఆరు రోజుల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా స్టోరీ పై ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే 2018 వ సంవత్సరం లో శ్రీకాకుళం లోని డి.మత్స్యలేశ్యం అనే గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి, పాకిస్థాన్ సైన్యంకి చిక్కి జైలుపాలు అయ్యారు. ఆ సమయంలో మాజీ సీఎం వై ఎస్ జగన్ ఇంకా అధికారం లోకి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్న రోజులవి. అలా పాదయాత్ర చేస్తూ శ్రీకాకుళంలోని ఈ మత్స్యకారుల కుటుంబాలను చేరుకొని వాళ్ళను పరామర్శించాడు. ఎట్టి పరిస్థితిలోనూ మా పార్టీ అధికారం లోకి రాగానే జైలుపాలైన 22 మత్స్యకారులను విడిపించి తీసుకొస్తానని మాట ఇచ్చాడు. ముఖ్యమంత్రి అవ్వగానే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాలకు చెరో 5 లక్షల రూపాయిల ఆర్ధిక సాయం కూడా అందించాడు. ఈ సంఘటనని వైసీపీ పార్టీ అభిమానులు సోషల్ మీడియా లో గుర్తు చేసుకుంటూ పోస్టులు వేస్తున్నారు.
మరి సినిమాలో ఇవన్నీ చూపిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చూపిస్తే పెద్ద ఎత్తున రచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాత అల్లు అరవింద్. ఆయన మెగా ఫ్యామిలీ కి చెందినవాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు ఆయన సినిమాలో చూపించి ఉండకపోవచ్చు. అల్లు అర్జున్ కేవలం తన స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్ళినందుకే ఆయనపై సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివిటీ ఏర్పడింది. ఇక అల్లు అరవింద్ ఇలా నేరుగా జగన్ కి సపోర్ట్ చేస్తూ సినిమాలో సన్నివేశాలు తీస్తే అంతే సంగతులు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడు. సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ ఈవెంట్ కి అభిమానులు లేకుండా కేవలం మూవీ యూనిట్ తో నిర్వహించనున్నారు.