
ప్రజారాజ్యం పార్టీలో యువ రాజ్యం అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ కొనసాగించిన దూకుడు అందరికీ తెలిసిందే. తనదైన ఆవేశానికి పంచ్ డైలాగులు జతచేసి ‘పంచెలు ఊడగొడతాం’ అంటూ సంచలన స్టేట్ మెంట్లు ఇచ్చారు. కానీ.. పవన్ ఆవేశాన్ని ఒక్క నిర్ణయంతో నీరుగార్చేవారు సోదరుడు చిరంజీవి. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కు సుతరామూ ఇష్టం లేకపోయింది. సాధ్యమైనంత వరకూ అడ్డుకునే ప్రయత్నం చేశాడనే ప్రచారం కూడా ఉంది. కానీ.. పార్టీని మోయలేక అర్జెంటుగా భారం దించేసుకునేందుకు చిరు సిద్ధపడ్డారు.
ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య వార్ నడుస్తోందంటూ లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. వీటికి నిజమే అనిపించేలా చాలా కాలం అన్నదమ్ములు కలిసి ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత మళ్లీ మెల్ల మెల్లగా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ‘జనసేన’ స్థాపించారు పవన్. తద్వారా.. ప్రజారాజ్యం ద్వారా కోల్పోయిన తన ఆశయాల వేదికను మళ్లీ పునర్ నిర్మించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2014 ఎన్నికల్లో పోటీ దూరంగా ఉండి బీజేపీ-టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్.. 2019లో బరిలోకి దిగి ఘోరంగా ఓడిపోయారు. దీంతో పవన్ పని అయిపోయిందనే ప్రచారం సాగింది.
కానీ.. పవన్ ప్రజల మధ్యనే ఉన్నారు. తద్వారా.. తానేదో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి రాలేదని చాటిచెప్పారు. పైపెచ్చు ఎన్నికలకు ముందే.. తాను ఇప్పటికిప్పుడు సీఎం సీటు కోరుకోవట్లేదని, సుమారు పాతికేళ్ల సమయం పెట్టుకున్నట్టు కూడా చెప్పారు. దీంతో.. దీర్ఘకాలం ప్రజాపోరాటం కొనసాగిస్తానని, వెనుదిరిగే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే.. సైద్ధాంతిక, ఆశలు, ఆశయాల పరంగా ఎన్ని చెప్పినా.. అవన్నీ నెరవేర్చుకోవాలంటే కావాల్సింది అధికారం. అది దక్కాలంటే అంతిమంగా కావాల్సింది ప్రజామోదం. దీన్ని సాధించేందుకు ప్రజల మధ్యనే ఉండి ప్రయత్నాలు సాగిస్తున్న పవన్ కు.. మరోసారి ‘చిరు’ గండం ఎదురవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి మనసు మళ్లీ రాజకీయాల వైపు మరలుతోందని, అయితే.. అది తమ్ముడి పార్టీవైపు కాకుండా.. జగన్ పార్టీ వైపు పయనిస్తోందని అంటున్నారు. జగన్ తో చిరు మెలుగుతున్న తీరు ఈ ప్రచారం నిజం కావడానికే అవకాశం ఎక్కువగా ఉందనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. సినీ పరిశ్రమ కొన్ని వరాలు ప్రకటించినప్పుడు జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. తమ్ముడు వకీల్ సాబ్ సినిమాకు అడ్డంకులు సృష్టించినప్పుడు మారు మాట్లాడలేదు. ఇప్పుడు వ్యాక్సినేషన విషయంలో మళ్లీ జగన్ భజన మొదలు పెట్టారు.
ఇదంతా ఒకెత్తయితే.. పవన్ రాకతో కాపుల్లో వైసీపీ బలం తగ్గింది. అటు టీడీపీలోని వారు కూడా పవన్ పై ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. ఏపీలో జనాభా పరంగా బలమైన సామాజిక వర్గం కాపులే. వచ్చే ఎన్నికల నాటికి వీరిని తమవైపు తెచ్చుకోవడం ఎలా అని భావిస్తున్న వైసీపీ… చిరంజీవిని బుట్టలో వేసుకోవాలని చూస్తోంది. ఇందుకోసం రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తోందని కూడా ప్రచారం సాగుతోంది. ఇటు చిరంజీవి కూడా సానుకూలంగానే ఉండే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఎన్నాళ్లూ సినిమాలు చేసుకున్నా.. ఇందులో ప్రత్యేకత ఏమీ ఉండదు. అయితే.. కోల్పోయిన రాజకీయ అవకాశాన్ని మళ్లీ అందుకోవాలని చూస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇదేదో తమ్ముడి పార్టీలో చేరొచ్చుగదా అంటే.. విమర్శలే ఎక్కువ. పార్టీని నడపలేక పోయినవాడు.. తమ్ముడి పార్టీలోకి వచ్చాడని అంటారు. అంతకంటే మరొకటి తమ్ముడి కిందనే అనివార్యంగా ఉండాలి. కాబట్టి.. వైసీపీ వైపు వెళ్లడానికే అవకాశం ఎక్కువ.
ఈ కారణాలతో చిరంజీవి వైసీపీ గూటికి చేరితే.. పవన్ కు ఇబ్బందికరమేనని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ లో కావొచ్చు.. కాపుల్లో కావొచ్చు.. చిరంజీవి మీద అభిమానంతో చాలా మందే ఉన్నారు. మరి, వీళ్లు పవన్ వైపు ఉంటారా? చిరువైపు వెళ్తారా? అనేది ప్రశ్న. ఈ లెక్క పవన్ కు చిరు కష్టం తప్పదని అంటున్నారు. మరి, ఏం జరుగుతుంది? అన్నది చూడాలి.