Jawan: సినిమా అనేది 24 విభాగాల దృశ్య కావ్యం. టికెట్ కొని వినోదాన్ని ఆశించే ప్రేక్షకుడికి.. పూర్తిస్థాయిలో పంచితేనే సినిమా విజయవంతం అవుతుంది. లేకుంటే పరాజయం పాలవుతుంది. కానీ కొన్ని కొన్ని సినిమాలు బలవంతంగా ప్రేక్షకుల చేత చూడబడతాయి. ఆ చూడబడిన తర్వాత.. టికెట్ కొన్న తర్వాత.. పెట్టిన ఆ రేట్ కి సినిమా గిట్టుబాటు కాక..ఆ ప్రేక్షకులు తనలో తానే తిట్టుకుంటారీ. తిట్టే తిట్లు కొన్నిసార్లు గ్రాంధికంలో కూడా ఉండవచ్చు. అలాంటి గ్రాంథికాన్ని జవాన్ అనే సినిమాకు విరివిగా వాడవచ్చు. ఎందుకంటే అంత గొప్పగా ఉంది మరి ఆ చిత్ర రాజం. కోట్లు కొల్లగొడుతోంది అని చెబుతున్నప్పటికీ.. కోట్లు కొల్లగొట్టేంత గొప్పదనం ఎందెందు వెతికినా కనిపించడం లేదు..
అట్లీయను అనే ఓ తమిళ యువ దర్శకుడికి షారుక్ ఖాన్ అనే దర్శకుడితో పని చేసే అవకాశం వచ్చి పడింది. ఆ అట్లీ ఉత్తర భారత వారికి మన దక్షిణ భారతం తడాఖా చూపించదలచినాడు. తనొక్కడి శక్తి సరిపోదని గ్రహించి, అత్యంత వ్యూహాత్మకంగా గురుతుల్యులైన పాత దర్శకుల్ని ఆశ్రయించెను. అనుభవజ్ఞులైన అన్నలూ.. ఉత్తర భారతావని మరొక్క మారు దడదడలాడించు సమయము ఆసన్నమైనది.. అందులకు మీ సహాయం కావాలెనని కోరెను. అతడు కోరిన పిమ్మట తమిళ దర్శక మూక ఈలలు వేసింది. అట్లీ యందున్న ప్రేమాతుశయముల చేత షెడ్డు కెళ్ళిపోయిన శంకరూ, రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్న మురుగదాసు ముందుకువచ్చిరి. అట్లేనని మాటిచ్చి, తలో సీనూ తీసి అట్లీ చేతిలో పెట్టి ఇంటర్వెల్ సన్నివేశం ఎవరు తీస్తే బాగుంటుందని ఆలోచించి అఖండుడైన బోయపాటి వద్దకు పంపించెను. అచ్చట బాలయ్యతో తన తదుపరి చిత్రం కోసం తయారు చేసి పెట్టుకున్న ఇంటర్వ్యూలు ఉదారంగా ఇచ్చినాడు విశాల హృదయయుడైన బోయపాటి.
అంతేగాక.. వృద్ధుడైన రెండవ హీరోయే సన్నివేశములో రంగ ప్రవేశం చేయవలెను. వస్తూ వస్తూనే విలనీయులను సుత్తి దెబ్బతో ఏల మోదవలెను, ఆ సమయమున పాత్రధారుల చుట్టూ ఎంత ధూళి రేగవలెను లాంటి ఇత్యాది పలు సాంకేతిక సలహాలు కూడా ఇచ్చి పంపినాడు.. దీంతో అట్లీ ఆనందానికి అవధులు లేక పోయినవి.
ద్వితీయార్థంలో మాంటేజ్ షాట్స్ కోసం మణిరత్నాన్ని వాడినాడు. మెలో డ్రామా కోసం మొగలిరేకులు లో నాయుడు ఎపిసోడ్ ను పరిశీలించినాడు. కొన్నిచోట్ల వేరే ఎవరిది దొరక్క తనవి తానే తెచ్చుకొని కలుపుకొని నాడు. ఈ మేలు జాతి దినుసులన్నింటినీ మూకుట్లో సన్నని సెగ మీద నువ్వుల నూనెలో వేయించి తాలింపు పెట్టినాడు. పొయ్యి మీద నుంచి దింపబోతు ఆఖరిలో ఏమన్నా కరివేపాకు సందేశం లాంటిది కూడా ఉంటే బాగుంటాదని తలంచి చివరికి కొరటాలను ఆశ్రయించినాడు. కొరటాలుడు బోలా శివుడు.. వచ్చినా కాదనని ఆచార్యుడు. భవిష్యత్తులో ఎప్పుడైనా అభిమానుల ఖర్మకాలి మహేష్ బాబు తో చిత్రం తీయాల్సి వస్తే అందులో వాడుకోవడానికి పనికొస్తుందని కొరటాల వారు ముందస్తుగానే ఒక రెండు ఠావుల సందేశాన్ని రాసి పెట్టుకొని నాడు. ఆ స్పీచ్ ను యధాతధంగా అట్లకి వాట్స్అప్ చేయగా.. దానిని కళ్ళకు అదుకొని ఆ పాఠం చే పులిహోర మిశ్రమం పరిపూర్ణం అయిందని అట్లీ ఆనందపడినాడు.
గుప్పు గుప్పుమని గుభాళిస్తున్న ఆ పులిహోర మిశ్రమం యొక్క ఘాటుకు అదిరిపడ్డాడు షారూఖుడు. ఇన్ని రకాల పెక్కు అంశములు మిక్కిలిగా కలిగిన చిత్ర రాజమును మా యొక్క జిందగీలో చూడనే చూడలేదు హై అని అట్లీని గాఢముగా హత్తుకొని నాడు. అందుకు ఆ అట్లీ “మీరు మాకు దక్షిణ పూర్వీకుల చిత్రములు పెద్దగా చూడకపోవుటచే నా అదృష్టము పండినదని” మనసులో నవ్వుకున్నాడు. అదీ ఈ చిత్రం యొక్క పూర్వ వృత్తాంతము. ఇందులో యే సన్నివేశం చూసినా గాని ఇది గతంలో చూసేసాం కదా అనిపించేలా ఉండడం మన దోషమే తప్ప అది అట్లీ గారి తప్పు యే మాత్రం కాదు. ఏది ఏమైననూ ప్ర మీద నిమ్మకాయను కూడా భారీ దబ్బ కాయ లాగా చూపించడంలో అట్లీ బాగా ఆరు తేరి నాడు. మన పెరుగన్నాన్ని జహీజింది జనానికి ప్రోబయోటిక్ యోగర్ట్ ఫుడ్ పేరిట పరిచయం చేయడంలో కృతకృత్యుడైనాడు. అందుకు అతనిని అభినందించవలసిందే.
నేపథ్య సంగీతానికి నేటి కాలమున మాతృ పెనిమిటిల కొనియాడబడుతున్న అనిరుధుడు యధావిధిగా విజృంభించినాడు. కాని ఆ మోజులో పడి పాటలని మాత్రం గాలికి వదిలినాడు. అట్లీ గారు లాజిక్కులను వదిలేసినట్టే. ముడతలు పడ్డ వాయిల్ చీర లాగా ఉండాల్సిన షారుక్ ముఖాన్ని సాఫు చేసిన టెర్లింగ్ క్లాత్ లాగా చూపించడానికి గ్రాఫిక్సే జేసేరో, లేక కోటింగే కొట్టేరో గానీ..భలే నున్నగా చూపినారు. విలన్ గారు పాపం షారుఖూడి ముఖాన్ని పలు రకముల ఉక్కు పరికరంతో ఎన్నిసార్లు రోటీ పచ్చడి లాగా చితకొట్టిన గాని ఆ తదుపరి షాటులోనే పండులా శుభ్రంగా కనబడటం వెనుక కారణం మేకప్ గారి కృషే మరి. వృద్ద షారుఖుడి, యువ గద్ద ముక్కు షారుఖుని పక్కన పెడితే ఎవరికి మేకప్ వేసి మేనేజ్ చేసినారో తేల్చుకోలేనంత బాగుండి నాడు షారుఖూడు. 40 వేల కోట్లు ఇట్టే ట్రాన్స్ఫర్ చేయగల శ్రీమంతుడైన సేతుపతి గారి కుమార్తె అత్యవసర సమయమున సాధారణ మెట్రోలో అది సామాన్యంగా తిరుగాడటం మనందరికీ ఎంతో సాలభ్యం మరియు గర్వకారణం.
పెళ్లయ్యాక బొత్తిగా భోజనాన్ని త్యజించేసినట్టున్న నయనతార బంగారం మీద చాలామంది ప్రేక్షకులు అలిగినారు. మా విగ్నేష్ అన్నయ్య వొన్నం అదీ సరిగ్గా పెడుతున్నాడా లేదా అని ఆరా తీయదలిచారు. ప్రాణాలు అర్పించడానికి వెనుకాడని బాయిలర్ కోళ్ల లాంటి దీపిక, ప్రియమణుల గురించి ఏమని వర్ణించేది? ఈ బహుభాషా సమ్మేళిత హిందీ చిత్రాన్ని తమిళంలో చూసి పరవశించిన ప్రేక్షకుల కష్టాన్ని ఏల కొనియాడేది.