Homeఎంటర్టైన్మెంట్Rebal Star Krishnam Raju: మొదటి సినిమా ప్లాప్ అయిందని తనకు తానే శిక్ష విధించుకున్నాడు:...

Rebal Star Krishnam Raju: మొదటి సినిమా ప్లాప్ అయిందని తనకు తానే శిక్ష విధించుకున్నాడు: తర్వాత రెబల్ స్టార్ అయ్యాడు

Rebal Star Krishnam Raju: అది 1966.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమా పరిశ్రమను ఏలుతున్న కాలం. ఆ సమయంలోనే “చిలకా గోరింక” అనే సినిమా విడుదలైంది. కానీ సినిమా ప్లాప్ అయింది. ఇప్పుడంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే కొందరు మినహా మిగతా హీరోలు పెద్దగా లెక్కచేయరు. నిర్మాతల నుంచి రెమ్యూనరేషన్ ముక్కు పిండి వసూలు చేస్తారు. కానీ తన తొలి సినిమా ప్లాప్ కావడంతో ఆ హీరో బాధలో కూరుకు పోయారు. ఎంతమంది సర్ది చెప్పినా వినలేదు. పైగా తనకు రెమ్యూనరేషన్ వద్దని నిర్మాతకు తేల్చి చెప్పారు. నటనను మెరుగుపరచుకునేందుకు తనకు తానే శిక్ష విధించుకున్నారు. నటనలో రాటు తేలేందుకు అనేక పుస్తకాలు చదివారు. ప్రముఖులు రాసిన గ్రంథాలను ఒంట పట్టించుకున్నారు. అయినప్పటికీ ఆయనకు సంతృప్తి కలగలేదు. పాతకాలం నటుడు సిహెచ్ నారాయణరావు దగ్గర శిక్షణ తీసుకున్నారు. నటనలో పూర్తిస్థాయి సంతృప్తి వచ్చేవరకు ఎన్ని అవకాశాలు వచ్చినా కాదనుకున్నారు. ఆయనలో నటుడి తాలూకు నిబద్ధత ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ చిన్ని ఉదాహరణ చాలు. ఎప్పుడైతే నటనలో పరిపక్వత సాధించాడో అప్పటి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. అంచలంచెలుగా ఎదిగి ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత.. రెండో తరం నటుల్లో రెబల్ స్టార్ అయ్యాడు. ఆయనే కృష్ణం రాజు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. సుప్రసిద్ధ నటుడు చిరంజీవి ది కూడా ఇదే గ్రామం. అప్పట్లో కృష్ణంరాజు సినిమా షూటింగ్ జరుగుతుంటే చిరంజీవి అక్కడికి వెళ్లారట. ఆయనలాగే నటించాలని అనుకున్నారట. చిరంజీవి ఆసక్తిని గమనించి కృష్ణరాజు దగ్గరికి పిలిపించుకున్నారట! నీ కళ్ళల్లో మంచి చార్మింగ్ ఉంది. నువ్వు తప్పకుండా పెద్ద హీరో అవుతావు అని ఆశీర్వదించారట. ఆయన అన్నట్టుగానే తర్వాతి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి తిరుగులేని హీరో అయ్యారు. కాగా కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.25 గంటలకు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో కన్నుమూశారు.

Rebal Star Krishnam Raju
Rebal Star Krishnam Raju

హీరోగా చేస్తూనే విలన్ గా..

హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణంరాజు.. విలన్ గా కూడా నటించారు. డూండీ దర్శకత్వంలో వచ్చిన “అవేకళ్ళు” అనే సినిమాలో విలన్ గా చేశారు. ఆ చిత్రంలో విలన్ గా ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అప్పట్లో ఆర్. నాగేశ్వరరావు అనే విఖ్యాత విలన్ పాత్రధారి ఉండేవారు. ఆయన కన్నుమూయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కృష్ణంరాజు రూపంలో మరో నటుడు తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చారని చాలామంది ప్రముఖులు అన్నారు. కృష్ణంరాజు విలక్షణ నటనా శైలి కారణంగా ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. 1977లో అమరదీపం చిత్రానికి గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి గాను ఆయన ప్రదర్శించిన నటనా విశ్వరూపానికి నంది అవార్డు అందజేసింది. 1986లో తాండ్ర పాపారాయుడు అనే చిత్రానికి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందజేసింది. 2006లో దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చింది.

మాస్ హీరో

కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు.. ఏళ్ల వ్యవధిలో తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చారు. కానీ వీరిలో కృష్ణంరాకు పై మాత్రమే మాస్ హీరో అని ముద్ర పడింది అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు వంటి చిత్రాలు ఆయనకు తిరుగులేని స్టార్ డం ను తెచ్చిపెట్టాయి. ఆయన కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడే హీరో సుమన్ తో కలిసి బావ బామ్మర్ది అనే సినిమాలో నటించి మెప్పించారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా సామాజిక సేవకుడిగా స్వగ్రామం మొగల్తూరులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తన సోదరుడు, హీరో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజును సేవా కార్యక్రమాల పర్యవేక్షకుడిగా నియమించారు. ప్రభాస్ ను హీరోగా తీసుకురావడంలో కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. తనకు వారసుడిగా ప్రకటించుకున్నారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, రక్షణ శాఖ సహాయ మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు.

Rebal Star Krishnam Raju
Rebal Star Krishnam Raju

అప్పట్లో కరువు తీవ్రంగా ప్రబలినప్పుడు పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో విరివిగా పనులు చేపట్టేవారు. ఫలితంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు తగ్గాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా హర్యానా నుంచి బియ్యం తెప్పించి కూలీలకు పంపిణీ చేశారు. దాతృత్వ గుణంలోనూ కృష్ణంరాజుకు ఎవరూ సాటి రారు. వేలాది మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఇచ్చారు. చదువుకునేందుకు ఇతోధికంగా సహాయపడ్డారు. ఆయన అనారోగ్యానికి గురి అయ్యేంతవరకు ఈ విద్యా యజ్ఞాన్ని ఆప లేదు. చివరగా ఆయన ప్రభాస్ హీరోగా వచ్చిన రాధే శ్యామ్ లో సినిమాలో నటించారు.
ఐదు దశాబ్దాలుగా సినీ, రాజకీయ ప్రయాణం చేస్తున్న కృష్ణంరాజు మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ మరో పెద్దదిక్కుని కోల్పోయింది. ప్రభాస్ పెళ్లి కళ్ళారా చూడాలనుకున్న కృష్ణంరాజు ఆ కల తీరకుండానే వెళ్ళిపోయారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular