Vijay Deverakonda: అత్యంత పోటీ నెలకొన్న పరిశ్రమల్లో సినిమా ఒకటి. ముఖ్యంగా సక్సెసుఫుల్ హీరో కావడం కోటిలో ఒకరికి దక్కే అదృష్టం. నెపో కిడ్స్ నేరుగా ఎంట్రీ ఉంటుంది. టాలెంట్ ఉంటే స్టార్ హోదా దక్కడం ఏమంత కష్టం కాదు. ఏ నేపథ్యం లేకుండా స్టార్ కావడం కత్తి మీద సామే. అందుకు అదృష్టంతో పాటు కఠిన శ్రమ, కృషి, ప్రతిభ ఉండాలి. సినిమా నేపథ్యం లేకుండా స్టార్ అయిన ఈ తరం హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. ఈయనకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. యువత విజయ్ దేవరకొండ చిత్రాల కోసం ఎగబడతారు.
Also Read: పల్లవి ప్రశాంత్ తో అమర్ దీప్ కోల్డ్ వార్… నేనెంటో వాళ్లకు చూపిస్తా అంటూ మాస్ వార్నింగ్
కాగా హీరో కావడం కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు. నువ్విలా మూవీలో ఆయనకు మొదటి ఛాన్స్ వచ్చింది. హవీష్ హీరోగా దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఓ రోల్ చేశాడు. ఇక రెండో చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్త నటులతో చిత్రాలు చేసి హిట్స్ కొడుతుంటాడు. ఆయన తెరకెక్కిన హ్యాపీ డేస్ బ్లాక్ బస్టర్ హిట్. దాంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సైతం కొత్త నటులతో శేఖర్ కమ్ముల తెరకెక్కించాడు.
ఈ మూవీలో ఛాన్స్ కోసం విజయ్ దేవరకొండ ఆడిషన్ ఇచ్చాడు. కొన్ని డైలాగ్స్ చెప్పాడు. దాదాపు 14 ఏళ్ల నాటి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో నటించాడు. అయితే ఆయన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అందులోనూ బస్తీ కుర్రాళ్లను ఏడిపించే రిచ్ కిడ్ గా నెగిటివ్ రోల్ చేశాడు. ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి సైతం నటించాడు.
దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఎవడే సుబ్రమణ్యం విజయ్ దేవరకొండకు నటుడిగా గుర్తింపు తెచ్చింది. ఇండస్ట్రీ దృష్టిలో పడేలా చేసింది. ఇక తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చిత్రంతో విజయ్ దేవరకొండను హీరోగా పరిచయం చేశాడు. ఆ మూవీ సూపర్ హిట్. నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. సందీప్ రెడ్డి వంగ ఆయన దశను మార్చేశాడు. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ ఫేమ్ ఎవరూ ఊహించని స్థాయికి వెళ్ళింది. విజయ్ దేవరకొండకు ఒక్క భారీ హిట్ పడితే టాప్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోతాడు.