
ఇండియన్ టెలివిజన్ లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న షోలలో ఇండియన్ ఐడల్ ఒకటి. ఈ సింగింగ్ కాంపిటేషన్ కు జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. ఇక్కడ విజేతగా నిలిచారంటే.. వారి కెరియర్ ఊహకందని రేంజ్ లోకి వెళ్లిపోతుంది. అలాంటి షోలో విన్నర్ గా నిలవాలన్ని టాలెంటెడ్ సింగర్స్ కలలు కంటుంటారు. ఈ రియాలిటీ షోకు సంబంధించి తాజాగా 12వ సీజన్ ముగిసింది. 12 గంటలపాటు నాన్ స్టాప్ గా సాగిపోయిన గ్రాండ్ ఫినాలేలో ఉత్తరాఖండ్ కు చెందిన పవన్ దీప్ రాజన్ విజేతగా నిలిచారు.
ఈ ఆదివారం జరిగిన ఫైనల్ లో విజేతగా నిలిచేందుకు కంటిస్టెంట్లు తీవ్రంగా ప్రయత్నించారు. తమదైన టాలెంట్ ను మొత్తం వెలికితీశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ పోటీ కొనసాగింది. అయితే.. అందరూ ఊహించినట్టుగానే పవన్ దీప్ రాజ్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. సీజన్ మధ్యలోకి రాగానే మెజారిటీ ఆడియన్స్ చూపు పవన్ దీప్ పైకి మళ్లింది. అతని గాత్రానికి ముగ్ధులయ్యారు. చివరి వరకు అదే టెంపో కొనసాగించిన పవన్ దీప్.. సూపర్ విన్నర్ గా నిలిచారు.
ఈ షోలో రెండో స్థానంలో అరుణిత కంజిలాల్ నిలిచారు. సయాలీ కాంబ్లే మూడు, మహ్మద్ డానిష్ నాలుగు, నిహాల్ టారో ఐదు స్థానాలు దక్కించుకోగా.. తెలుగు తేజం షణ్ముఖ ప్రియ మాత్రం ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఫలితం అభిమానులను నిరాశకు గురిచేసింది. టాప్ 3లో షణ్ముఖ ప్రియ నిలుస్తుందని చాలా మంది భావించారు. కానీ.. ఆరో స్థానంతో సరిపెట్టుకోవడంతో నిరాశకు గురయ్యారు. ఆమెకు అన్యాయం జరిగిందని అన్నారు.
ఇక, ఇండియన్ ఐడల్ టైటిల్ సొంతం చేసుకున్న పవన్ కు భారీ నజరానాలు దక్కాయి. విజేతకు నిర్వాహకులు అందించే 25 లక్షల రూపాయలతోపాటు మారుతీ కంపెనీ నుంచి స్విఫ్ట్ కారు బహుమతిగా లభించింది. లక్షలాది మంది ఆడియన్స్ చూస్తుండగా.. ఆనందోత్సాహాల నడుమ టైటిల్ ను అందుకున్నారు పవన్ దీప్.
టాప్ 5లో నిలిచిన వారికి కూడా నగదు బహుమతి దక్కింది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అరుణిత, సయాలీ కాంబ్లీకి చెరో ఐదు లక్షల చొప్పున పారితోషికం అందజేశారు నిర్వాహకులు. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన డానిష్, నిహాల్ కు చెరో మూడు లక్షలు దక్కాయి.