India Vs England 5th Test: ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 3-1 తేడాతో ట్రోఫీని భారత్ దక్కించుకుంది. హైదరాబాదులో తొలి టెస్ట్ ఓడిపోయిన అనంతరం.. భారత జట్టు గోడకు కొట్టిన బంతిలాగా దూసుకొచ్చింది. వరుసగా విశాఖపట్నం, రాజ్ కోట్, రాంచీలో విజయాలు సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. రాజ్ కోట్ లో భారీ గెలుపు సాధించి భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇక ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్టు కోసం భారత జట్టు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ట్రోఫీ దక్కించుకున్న రోహిత్ సేన పై ఎటువంటి ఒత్తిడి లేకపోగా.. మూడు వరుస ఓటములతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు ధర్మశాల టెస్ట్ చాలా కీలకం. ఇక్కడ గెలిచి ఎలాగైనా పరువు నిలుపుకోవాలని బెయిర్ స్టో సేన భావిస్తోంది.
అనామకం కాదు
ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టుకు ధర్మశాల మ్యాచ్ అనామకమైనదే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాకుంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్ లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది. ధర్మశాల మ్యాచ్ మాత్రమే కాదు ఇకనుంచి ఆడే ప్రతి మ్యాచ్ కూడా టీం ఇండియాకు అత్యంత కీలకం. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. మొన్నటిదాకా న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండేది. ఇంగ్లాండ్ పై వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో 64.58 విజయాల శాతంతో భారత్ టాప్ లోకి దూసుకొచ్చింది. ఇక న్యూజిలాండ్ 60, ఆస్ట్రేలియా 59.09 విజయాల శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మొదటి స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకోవాలి అంటే భారత జట్టు ప్రతి మ్యాచ్ ను కీలకంగా భావించాలి.
జట్టు ఎలా ఉంటుందంటే
రాంచి టెస్ట్ కు భారత స్పీడ్ స్టార్ బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ధర్మశాల లో జరిగే టెస్టులో అతడు ఆడతాడని టీం మేనేజ్మెంట్ చెబుతోంది. ఇప్పటికే మూడు టెస్టుల్లో బుమ్రా 17 వికెట్లు తీశాడు. ఒకవేళ అతడు జట్టులో ఆడితే సిరాజ్ లేదా ఆకాష్ పై వేటుపడే అవకాశం ఉంది. ఒకవేళ ధర్మశాల మైదానాన్ని బట్టి ముగ్గురు స్పీడ్ బౌలర్లతో భారత జట్టు బరిలోకి దిగినా ఆశ్చర్య పోవలసిన పని లేదని మాజీ ఆటగాళ్లు అంటున్నారు. రాంచీ టెస్ట్ లో భారత్ విజయం సాధించేందుకు వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కీలకపాత్ర పోషించాడు. ఐదో టెస్టులో అతడు జట్టులో కొనసాగేది దాదాపు కాయమే. అదే చివరి టెస్టుకూ రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది. పాటిదార్ ఆకట్టుకోకపోవడంతో దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వందో టెస్ట్ ఆడుతున్న నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ కు కచ్చితంగా అవకాశం లభిస్తుంది. ఆల్ రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా జట్టులో ఉంటాడు. ఒకవేళ మూడో పేసర్ లేదా స్పెషలిస్ట్ స్పిన్నర్ అనే చర్చ జరిగినప్పుడు ఒకవేళ మేనేజ్మెంట్ స్పిన్నర్ వైపు మొగ్గుచూపితే కులదీప్ యాదవ్ కు అవకాశం లభిస్తుంది.
మైదానం అనుకూలిస్తుందా
ధర్మశాల శీతల ప్రాంతం కావడంతో పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని క్యూరేటర్లు చెబుతున్నారు. రెండు మూడు రోజుల తర్వాత స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తుందని అంటున్నారు. 2017లో ఇక్కడ జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఆస్ట్రేలియా పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ విజయంలో భారత స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఆ మ్యాచ్ తో కులదీప్ యాదవ్ భారత జట్టులోకి ఆరెంగేట్రం చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మరోవైపు ఈ మైదానం ఏకపక్షంగా ఉండదని.. రెండు జట్లకు అనుకూలిస్తుందని ఇంగ్లాండ్ ఆటగాడు, 100 టెస్ట్ ఆడుతున్న జానీ బెయిర్ స్టో పేర్కొన్నాడు.