India Vs Bangladesh: అదరగొడుతున్న స్పిన్నర్లు… బాల్ తో కాదు, ఈ సారి బ్యాట్ తో..

టీమిండియా స్పిన్నర్లు అదరగొడుతున్నారు. బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సత్తా చాటుతున్నారు. తొలి రెండు సెషన్లలో పై చేయి సాధించిన బంగ్లా బౌలర్ల పై పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 19, 2024 5:41 pm

India Vs Bangladesh(2)

Follow us on

India Vs Bangladesh: చెన్నై వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్ లో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ కు వచ్చింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రంగంలోకి దిగారు. కానీ రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గిల్ 0 పరుగులకు అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో భారత జట్టు 10 ఓవర్లలో 34 పరుగులు చేసి కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో రిషబ్ పంత్(39), యశస్వి జైస్వాల్ (56) జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 65 పరుగులు జోడించారు. ఈ దశలో రిషబ్ పంత్ హసన్ మహమూద్ బౌలింగ్ లో కీపర్ లిటన్ దాస్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (16) హాసన్ మిరాజ్ బౌలింగ్లో జాకీర్ హసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. యశస్వి జైస్వాల్ నహీద్ రానా బౌలింగ్లో షాద్మాన్ ఇస్లాం కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 144 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది.

కదం తొక్కారు

ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను బ్యాటింగ్ కు పంపించాడు. కెప్టెన్ తమపై ఉంచిన నమ్మకాన్ని వారిద్దరు నిలబెట్టుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ (102*), రవీంద్ర జడేజా (86*) ఏడో వికెట్ కు రికార్డు స్థాయిలో 195 పరుగులు జోడించారు. ఫలితంగా భారత జట్టు మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసి, పటిష్ట స్థితిలో నిలిచింది.. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. నహీద్ రాణా, హాసన్ మిరాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. వాస్తవానికి ఆరు వికెట్ల నష్టానికి భారత్ 144 వద్ద ఉన్నప్పుడు.. మహా అయితే ఇంకా 60 పరుగులు చేసి ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్, గిల్, రాహుల్ తేలిపోయినచోట సత్తా చాటారు. బంగ్లా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. వీరిద్దరూ ఒకరకంగా బంగ్లా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు.. వీరిద్దరిని అవుట్ చేయడానికి బంగ్లా కెప్టెన్ ఏకంగా ఆరుగురు బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సొంత మైదానం కావడంతో రవిచంద్రన్ అశ్విన్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా ఆడాడు. వీరిద్దరి ఆటతీరుతో భారత్ 339 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు తొలి రెండు సెషన్లలో పై చేయి సాధించినప్పటికీ.. తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది.

ఈసారి బ్యాట్ తో..

రవిచంద్రన్ అశ్విన్ బంతితో మాయ చేయగలడు. తనదైన రోజు అద్భుతాలు సృష్టించగలడు. అయితే సొంత మైదానంలో ఈసారి బంతితో కంటే ముందు బ్యాట్ తో అతడు మాయాజాలాన్ని సృష్టించాడు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక రవీంద్ర జడేజా కూడా ఆల్రౌండర్ అయినప్పటికీ.. ఇటీవల కాలంలో అతడు స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. టి20 క్రికెట్ కు శాశ్వత విరామం ప్రకటించిన తర్వాత.. బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో అతడు సత్తా చాటాడు. రవిచంద్రన్ అశ్విన్ కు జత కలిసి భారత జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సెంచరీకి 14 పరుగుల దూరంలో నిలిచాడు. అతడి జోరు చూస్తుంటే శుక్రవారం సెంచరీ చేసేలాగా కనిపిస్తున్నాడు.