Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న “సలార్” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. “కే జీ ఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం సినిమాకి సంబంధించిన అప్డేట్ ల విషయంలో చాలా ఆలస్యం చేస్తోంది. ఒకవైపు రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలోని మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 28న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలవుతుంది అని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు మాత్రం మొదలు అవలేదు.
ఈ నేపథ్యంలో అభిమానులు ఇప్పటికే చాలా నిరాశ చెందుతున్నారు. మరోవైపు ప్రభాస్ గత రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో అభిమానులు ఈ సినిమా పైన ఆశలన్నీ పెట్టుకున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కానీ కొంతమంది అభిమానులకి టీజర్ అంతగా నచ్చలేదు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ లేదా పాటల గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన అప్డేట్లు మాత్రం చిత్ర బృందం ఇంకా విడుదల చేయడం లేదు.
అయితే ఒకవైపు చిత్ర బంధం అప్డేట్ల విషయంలో సైలెంట్ గా ఉండగా మరోవైపు అభిమానులు మాత్రం సినిమా విడుదల కోసం కౌంటర్లు మొదలు పెట్టేసారు. సినిమా విడుదల అవ్వడానికి ఇంకా 50 రోజులు ఉంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఒక ట్రెండ్ ని సృష్టించారు. మరి ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏం చేస్తుందో వేచి చూడాలి.
శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. హొంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందుర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రిత్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియ రెడ్డి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.