Tollywood: వైసీపీ హయాంలో ఏపీలో టికెట్స్ ధరలు భారీగా తగ్గించారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు ఫైట్ చేయాల్సి వచ్చింది. వైసీపీ మంత్రులు, టాలీవుడ్ పెద్దల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. చిరంజీవి నేతృత్వంలో ఒక బృందం మాజీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. కొంత మేర టికెట్స్ ధరలు పెంచారు. బెనిఫిట్ షోల విషయంలో కఠిన నియమాలు ఉండేవి. అక్కడ కూటమి ప్రభుత్వం కొలుదీరడంతో టాలీవుడ్ ఆనందం వ్యక్తం చేసింది.
ఏపీలో ఉపశమనం దొరికింది అనుకుంటే.. టాలీవుడ్ కి గుండెకాయలాంటి తెలంగాణలో కష్టాలు మొదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ మీద గుర్రుగా ఉన్నాడని ఆయన తీరు చూస్తే అర్థం అవుతుంది. అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ పెద్దలను అసెంబ్లీ సాక్షిగా ఏకిపారేశారు. పరుష పదజాలంతో దుయ్యబట్టాడు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వము. టికెట్స్ ధరల పెంపు కూడా ఉండదని స్పష్టం చేశాడు. ఇది పెద్ద కుదుపు. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు నష్టపోనున్నాయి.
కాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సీపీఐ పార్టీ ఆహ్వానించింది. ఆ పార్టీ ప్రధాన నేతలు నారాయణ, రామకృష్ణ మద్దతు తెలిపారు. ఏపీలో కూడా ఈ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు సినిమాకు ఏపీ అతిపెద్ద మార్కెట్. నైజాం కి మించిన వసూళ్లు అక్కడ దక్కుతాయి. ఏరియా పరంగా కూడా చాలా పెద్దది. బెనిఫిట్ షోల కారణంగా మహిళ మృతి చెందిన నేపథ్యంలో ఈ వివాదం మరింత పెద్దది కావచ్చు. అల్లు అర్జున్ ఇంటిపై దాడులు కూడా జరిగాయి.
నేతల సంగతి పక్కన పెడితే ప్రజల్లో నుండి డిమాండ్ వస్తే ఏపీ ప్రభుత్వం కూడా పునరాలోచన పడే అవకాశం కలదు. అదే జరిగితే టాలీవుడ్ కి మరిన్ని కష్టాలు తప్పవు. ఏపీలో టికెట్స్ ధరలు తగ్గితే.. స్టార్ హీరోల సినిమాలకు కష్టాలు తప్పవు. గతంలో మాదిరి వందల కోట్ల రూపాయలతో సినిమాలు చేయకపోవచ్చు. హీరోల రెమ్యూనరేషన్స్ కూడా తగ్గుతాయి. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా టాలీవుడ్ ఎదిగింది. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాల బడ్జెట్ రూ. 300 నుండి 600 వరకు ఉంటున్నాయి. ఇక మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో రానున్న చిత్రం ఏకంగా రూ. 1000 కోట్లతో తెరకెక్కించనున్నారట. టికెట్స్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి లేకుండా ఇలాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టడం కష్టం…