Nandamuri Mokshagna : హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో భారీగా ప్లాన్ చేసిన మోక్షజ్ఞ మూవీ ఆగిపోయిందంటూ టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ బాలకృష్ణకు ఝలక్ ఇచ్చాడట. ఈ ప్రాజెక్ట్ కి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. రూ. 15 కోట్లతో పాటు లాభాల్లో వాటా అడుగుతున్నాడట. లేదంటే మోక్షజ్ఞ మూవీ తన అసిస్టెంట్స్ లో ఒకరు డైరెక్ట్ చేస్తారని తేల్చి చెబుతున్నాడట. ప్రశాంత్ వర్మ తీరుతో బాలకృష్ణ విసిగిపోయాడట. ఇటీవల జరగాల్సిన మోక్షజ్ఞ మూవీ లాంచింగ్ ఈవెంట్ వాయిదా పడటానికి ప్రశాంత్ వర్మనే కారణం అట.
బాలకృష్ణ మరో దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారట. ప్రశాంత్ వర్మ మూవీ దాదాపు క్యాన్సిల్ అయినట్లే అట. తెరపైకి నాగ్ అశ్విన్ వచ్చాడట. మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్ కి నాగ్ అశ్విన్ పరిచయం చేయబోతున్నాడు అనేది లేటెస్ట్ టాక్. ఇదే నిజమైతే మోక్షజ్ఞ ఎంట్రీ చాలా ఆలస్యం కానుంది. నాగ్ అశ్విన్ కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంది. కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారు.
మరి మోక్షజ్ఞతో నాగ్ అశ్విన్ మూవీ చేయాల్సి వస్తే అది ఎప్పుడనే సందిగ్ధత నెలకొంది. కల్కి 2 తర్వాత అంటే కనీసం రెండేళ్లు వేచి చూడాలి. కల్కి 2 కి ముందే మోక్షజ్ఞ మూవీ నాగ్ అశ్విన్ పట్టాలెక్కించినప్పటికీ ఏడాది సమయం తీసుకుంటుంది. నాగ్ అశ్విన్ కథను సిద్ధం చేసి మోక్షజ్ఞ మూవీ ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేయడం అప్పటికప్పుడు అయ్యే పని కాదు.
మోక్షజ్ఞ వయసు 30 ఏళ్ళు కాగా.. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కొన్ని రోజుల్లో పట్టాలెక్కాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే, అది బాలయ్యకు పెద్ద షాక్ అని చెప్పాలి. మోక్షజ్ఞ సైతం తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కాగా మోక్షజ్ఞ ఇన్నేళ్లు ఎందుకు హీరో కాలేదనే వాదన ఉంది. మోక్షజ్ఞకు నటన పట్ల మక్కువ లేదు. బిజినెస్ మెన్ గా మారాలని అనుకుంటున్నారు అంటూ.. గతంలో కథనాలు వెలువడ్డాయి. మొత్తంగా లేటెస్ట్ కథనాలు బాలయ్య ఫ్యాన్స్ లో అసహనం రేపుతున్నాయి.