Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్స్ పెట్టడంతో ఆయనపై తాజాగా కేసులు నమోదయ్యాయి. ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. దొరికితే అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఆయన ప్రత్యేక వీడియో ఒకటి విడుదల చేశారు. తాను భయపడడం లేదని.. తాను ఏ తప్పు చేయలేదని.. నేను ఒకరిని అంటే మరొకరి మనోభావాలు దెబ్బ తినడం ఏమిటని.. ఒకేరోజు రాష్ట్రం నలుమూలల వారి మనోభావాలు దెబ్బతిన్నాయా? అంటూ వెటకారంగా మాట్లాడారు. అయితే ఈ వెటకారంతోనే జైలు దాకా పరిస్థితి తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ. గత కొన్నేళ్లుగా వైసీపీ అధినేత జగన్ కు గట్టి మద్దతుదారుడుగా నిలిచారు రాంగోపాల్ వర్మ. ఆయనకు మద్దతుగా చాలా రకాల సినిమాలు కూడా తీశారు. జగన్ ప్రత్యర్థుల కు వ్యతిరేకంగా పాత్రలు రూపొందించారు. జగన్ రాజకీయ జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని వ్యూహం అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. ఇప్పుడు వాటిపైనే కేసులు నమోదయ్యాయి. ఆర్జీవి పోలీస్ విచారణను తప్పించుకుంటూ పరారీలో ఉన్నారు. కానీ ఆయనలో ఉన్న వెటకారం ఇప్పటికీ తగ్గకపోవడం విశేషం.
* సెంట్రల్ జైలు వద్ద సెల్ఫీ
గత ఏడాది ప్రతిపక్ష నేతగా ఉన్న.. ఏపీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అసలు ఆధారాలు లేని కేసులో ఆయన అరెస్టయ్యారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆయనకు బెయిల్ కూడా లభించకుండా చేశారు. అయితే ఆ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దసెల్ఫీ తీసుకుని రాక్షసానందం పొందారు రామ్ గోపాల్ వర్మ. ఆ సెల్ఫీ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులు పైశాచిక ఆనందం పొందారు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు నాటి ఫోటోను విడుదల చేశారు.అయితే దీనిపై మాట మార్చారు రాంగోపాల్ వర్మ.జైలులో జగన్ ఉన్నా, గాంధీ ఉన్నా, హిట్లర్ ఉన్నా అలానే చేస్తానని చెప్పుకొచ్చారు.
* చేజేతులా నాశనం
తనకు తాను తెలివైన వాడిగా భావిస్తుంటారు రామ్ గోపాల్ వర్మ.భారత చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.కానీ ఏపీ రాజకీయ వివాదాల్లో చిక్కుకొని జేజేతులా తనకున్న పేరును పోగొట్టుకుంటున్నారు. ఆయన వైసీపీ నేత కాదు. ఆయన ఎవరి కింద పని చేసే తత్వము కాదు. కానీ వైసీపీకి బలమైన సోషల్ మీడియా మద్దతుదారుడుగా నిలిచిపోయారు. తనకున్న మంచి ఇమేజ్ ను పాడు చేసుకున్నారు.ఇప్పుడు జైలు దాకా వచ్చినా ఆయన వెటకారం తగ్గకపోవడం విశేషం.