
కొన్ని డైలాగులు.. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రవేస్తాయి. తరచూ ఎక్కడో ఒక చోట వాటి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి.. మగధీర చిత్రంలో వంద మందిని కాలభైరవుడు ఎదుర్కొనే సన్నివేశం. ‘‘ఒక్కొక్కడినీ కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి రమ్మను’’ అంటూ రామ్ చరణ్ పలికిన డైలాగ్, ఆ తర్వాత కొనసాగిన మగధీరుడు ఫైట్ అద్భుతమేనని చెప్పాలి. వంద మందిని ఒక్కడు చంపడం అంటే.. బయట అతిగా అనిపిస్తుంది. కానీ.. ఆ సన్నివేశాన్ని రాజమౌళి తెరకెక్కించిన తీరు, ఎంచుకున్న లొకేషన్ ప్రేక్షకులందరినీ కన్విన్స్ చేసిపారేసింది.
ఇప్పుడు అలాంటి ఓ సన్నివేశం RRRలో ఉందని టాక్. అప్పుడు వంద మందిని అంతుచూసింది రామ్ చరణ్ కాగా.. ఇప్పుడు వంద మందిని మట్టుబెట్టే రోల్ జూనియర్ కు అప్పగించాడట జక్కన్న. ఈ ఫైట్లో వంద మంది బ్రిటీషర్లతో కొమరం భీమ్ భీకరంగా తలపడనున్నాడట. ఈ మధ్యనే ఈ కీలక ఎపిసోడ్ ను కూడా షూట్ చేశారట. ఈ భారీ ఫైట్ కోసం ఏకంగా 20 రోజులపాటు షూటింగ్ జరిపాడట రాజమౌళి.
అంతేకాదు.. ఈ చిత్రంలోని మొత్తం యాక్షన్ ఘట్టాల్లో.. ఇదే అగ్రస్థానంలో ఉంటుందని చెబుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ఫైట్ కు భారీగా ఖర్చు చేసిన వాటి జాబితాలోనూ.. ఇదే మొదటి స్థానంలో నిలుస్తుందని అంటున్నారు. మొత్తంగా.. నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఈ ఫైట్ ను తెరకెక్కించాడట జక్కన్న.
రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతి సినిమాలోనూ ఒక స్పెషల్ ఫైట్ ఉంటుంది. ఇప్పటి వరకూ రాజమౌళి తీసిన ప్రతి సినిమాలోనూ ఒక స్పెషల్ ఫైట్ ఉంటుంది. RRRలోని ఈ ఫైట్ అంతకు మించి అన్న రేంజ్ లో ఉంటుందట. మరి, ఆ ఫైట్ ను ఆస్వాదించడానికి ఇంకా ఎంతకాలం వేచి చూడాలో తెలియదు. విడుదల తేదీ మళ్లీ మారుతుందనే అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.