National Film Awards: ఆగస్టు 24న భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా నేషనల్ అవార్డ్స్ ప్రకటించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డు అలియా భట్, కృతి సనన్ సంయుక్తంగా అందుకున్నారు. ఇక 69వ నేషనల్ అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటింది. ఏకంగా 6 అవార్డ్స్ కొల్లగొట్టింది. టాలీవుడ్ కి మొత్తంగా 11 అవార్డ్స్ వివిధ విభాగాల్లో దక్కాయి. అయితే ఈ నేషనల్ అవార్డ్స్ పై జనాల్లో సందేహాలు నెలకొన్నాయి. 2021, 2022 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు అవార్డులు ప్రకటించారు.
2021 సంవత్సరానికి గానూ ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో 2022లో విడుదలైన చిత్రాలకు చోటు ఎలా దక్కింది? ఆ చిత్రాలను అవార్డ్స్ కి ఎందుకు ఎంపిక చేశారు? అని పలువురు సందేహ పడుతున్నారు. 2022లో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ విపరీతంగా డామినేట్ చేసింది. ఆ సినిమా బరిలో లేకుండా ఇతర సినిమాలకు అవార్డ్స్ పొందేవి. అలాగే ఉత్తమ నటి అవార్డు కొల్లగొట్టిన గంగూబాయి కతియావాడి చిత్రం సైతం 2022లో విడుదలైంది. ఉత్తమ చిత్రం అవార్డు అందుకున్న రాకెట్రీ కూడాను. ఈ మూడు చిత్రాలు 8 అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి.
దీనిపై ప్రసార, సమాచార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ ని పలువురు నిలదీశారు. ఈ క్రమంలో ఆయన వివరణ ఇచ్చారు. నింబంధనల ప్రకారం 2021 జనవరి 1 నుండి 2021 డిసెంబర్ 31వరకు సెన్సార్ జరుపుకున్న ప్రతి సినిమా పరిగణలోకి వస్తుంది. ఆ చిత్రాల విడుదల తేదీలతో సంబంధం లేకుండా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన తేదీ ఆధారంగా అవార్డుల ఎంపికకు పరిగణలోకి తీసుకోవడం జరిగింది.
ఆ విధంగా ఆర్ ఆర్ ఆర్, గంగూబాయి కతియావాడి, రాకెట్రీ చిత్రాలు 2021లోనే సెన్సార్ పూర్తి చేశాయి. అందుకే ఆ చిత్రాలు 2021 నేషనల్ అవార్డ్స్ లో పోటీపడ్డాయని చెప్పుకొచ్చారు. దీంతో అందరి అనుమానాలు తీరాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడు వంటి ప్రధాన అవార్డుతో పాటు మరో 10 అవార్డులు సొంతం చేసుకుంది. పుష్ప చిత్రానికి రెండు, ఆర్ ఆర్ ఆర్ కి 6 ఉప్పెన చిత్రానికి 1, కొండపొలం చిత్రానికి 1 అవార్డు, ఉత్తమ తెలుగు ఫిల్మ్ క్రిటిక్ గా మరో అవార్డు దక్కాయి.