Chandrababu Arrest: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగి నలభై రోజులు దాటిపోయింది. స్కిల్ డెవలప్ స్కామ్ ఆరోపణలపై రాజమండ్రి జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇది కక్ష సాధింపు చర్య అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పార్టీ అభిమానులు, కార్యకర్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబును బయటకు తేవాలని దేశంలోనే గొప్ప లాయర్లు ప్రయత్నం చేస్తున్నా న్యాయస్థానాల్లో చెక్కెదురవుతుంది. ఇక చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా టాలీవుడ్ పెద్దలు మాట్లాడాలనే డిమాండ్ ఉంది.
నటుడు మురళీ మోహన్, నిర్మాత అశ్వినీ దత్, దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు రవిబాబుతో పాటు ఒకరిద్దరు స్పందించారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఒకప్పుడు టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సురేష్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. విలేకరి ప్రశ్నకు సమాధానంగా… చిత్ర పరిశ్రమ నాన్ పొలిటికల్, నాన్ రెలిజియస్ బాడీ. ఇండస్ట్రీ తరపున ఎవరూ పొలిటికల్ కామెంట్స్ చేయరు. ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం.
చిత్ర పరిశ్రమకు చాలా మంది ముఖ్యమంత్రులు మంచి చేశారు. అందరి కంటే మర్రి చెన్నారెడ్డి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. పరిశ్రమ పొలిటికల్ ఇష్యూస్ మీద మాట్లాడాల్సి వస్తే… చాలా విషయాల మీద స్పందించాల్సి ఉంటుంది అన్నారు. అయితే కొందరు స్వచ్ఛందంగా చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తున్నారు. హీరోయిన్ పూనమ్ కౌర్ మొదటి నుండి చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు.
73 ఏళ్ల వయసులో ఆయన జైలులో ఉండాల్సి రావడం విచారకరం అని గతంలో ట్వీట్ చేశారు. తాజాగా ఆమె చంద్రబాబు విడుదల కావాలని పూజలు చేశారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న పూనమ్ కౌర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు విడుదల కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె చెప్పారు. సినిమాల్లో పెద్దగా రాణించకున్నా.. పూనమ్ పొలిటికల్, సోషల్ కామెంట్స్ తో పాపులర్ అయ్యారు.