Hansika Marriage: హీరోయిన్ హన్సిక మోత్వానీ పెళ్ళికి సర్వం సిద్ధమని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం హన్సిక వివాహం ఖాయమే అంటున్నారు. హన్సిక డిసెంబర్ నెలలో పెళ్లి పీటలు ఎక్కనున్నారట. ఇక హన్సిక వివాహానికి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో గల ముందోట ప్యాలస్ లో వేదిక కానుంది. 450 ఏళ్ల నాటి పురాతన కోటలో హన్సిక వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ప్యాలస్ మేనేజ్మెంట్ సమాచారం ప్రకారం హన్సిక కొన్ని రూమ్స్ తో పాటు వివాహానికి అవసరమైన వేదిక బుక్ చేశారట.

ఖచ్చితమైన తేదీ తెలియనప్పటికీ డిసెంబర్ లో హన్సిక వివాహం జరగడం లాంఛనమే అంటున్నారు. ఇంతకీ అబ్బాయి ఎవరనేగా మీ సందేహం. హన్సికకు కాబోయేవాడి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే అతడు హన్సిక బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. ప్రేమించినవాడినే హన్సిక భర్తగా చేసుకుంటున్నారట. అతని వివరాలు బాలీవుడ్ మీడియా సైతం రిపోర్ట్ చేయలేదు.
హన్సిక ప్రస్తుత వయసు 31 ఏళ్ళు. వివాహం విషయంలో ఇంకా ఆలస్యం చేయడం సరికాదని ఆమె భావిస్తున్నారట. అందులోనూ దాదాపు 20 ఏళ్ల కెరీర్ చూసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమై స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా కూడా చేశారు. దేశముదురు సినిమాతో ఆమెను దర్శకుడు పూరి హీరోయిన్ చేశాడు. అప్పటికి హన్సిక ఇంకా టీనేజ్ లో ఉంది. దేశముదురు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆమెకు ఆఫర్స్ వచ్చాయి.

ఎన్టీఆర్ తో కంత్రి, ప్రభాస్ తో బిల్లా చిత్రాలు చేశారు. మంచి ఆరంభం లభించినా హన్సిక తెలుగులో నిలదొక్కుకోలేకయారు. మెల్లగా ఆమెను స్టార్ హీరోలు పక్కన పట్టేశారు. చాలా కాలం క్రితమే హన్సిక కోలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయారు. హన్సిక చివరిగా తెలుగులో నటించిన చిత్రం తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాల వరకూ ఉన్నాయి. వాటిలో మేజర్ తమిళ్ ప్రాజెక్ట్స్. కాగా ఆ మధ్య కోలీవుడ్ మన్మధుడు శింబుతో హన్సిక ప్రేమాయణం నడిపింది. ఓపెన్ గానే అతనితో రిలేషన్ ఎంజాయ్ చేసింది. ఒక దశలో హన్సిక-శింబు వివాహం చేసుకుంటారని కోలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వినిపించింది. గత అఫైర్స్ మాదిరి హన్సికను పెళ్ళికి ముందే శింబు కట్ చేశాడు. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.