‘‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్.. బెస్ట్ ఇంప్రెషన్!’’ ఇది సరైన పద్ధతా? కాదా? అనే విషయం పక్కన పెడితే.. ప్రపంచం మొత్తం దీన్నే ఫాలో అవుతూ ఉంటుంది. ఏ రంగంలోనైనా తొలి అడుగు విజయంతో మొదలు పెడితే అతడు సక్సెస్ కు చిరునామాగా మారిపోతాడు. ఇక, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే.. అది అంతకు మించి! తొలి సినిమానే చాలా వరకు కెరీర్ ను డిసైడ్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. విజయం సాధిస్తే ఓకే.. విఫలమైతే మాత్రం ‘తెర’మరుగయ్యే ఛాన్సును కూడా కొట్టిపారేయలేం!
Also Read: మహేష్ ‘సర్కారి వారి పాట’ నుంచి సర్ ప్రైజ్
అందుకే.. ప్రతీ ఒక్కరికి తొలిఅడుగు ఎంతో కీలకం సినిమా ఇండస్ట్రీలో! ఈ కారణం చేతనే డెబ్యూ మూవీని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు చాలా మంది. ఇక వారసుల ఎంట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ఆలోచనలు.. మరెన్నో సూచనల తర్వాత వారిని రంగంలోకి దించుతారు. అయినప్పటికీ.. చాలా మందికి గెలుపు అల్లంత దూరంలోనే ఆగిపోతుంది. కొందరిని మాత్రమే నెత్తిమీద పెట్టుకుంటుంది. ఆ లక్కీ గాయ్స్ లిస్ట్ చూస్తే టాలీవుడ్ లో వేళ్ల మీద లెక్కబెట్టేంత మంది మాత్రమే ఉన్నారు.
ఇప్పుడు టాలీవుడ్ లో మెగా వారసుడు వైష్ణవ్ గురించి సాగుతున్న డిస్కషన్ అంతా ఇంతా కాదు. తొలి సినిమాతోనే భలే హిట్ కొట్టేశాడంటూ మాట్లాడుకుంటున్నారు. ఎంతో మందికి ఎన్నో ప్లానింగ్స్ చేసినా దక్కని విజయాన్ని సొంతం చేసున్నాడని చర్చించుకుంటున్నారు. ఇప్పడు ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రూ.21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ‘ఉప్పెన’.. కేవలం మూడు రోజుల్లోనే రూ.27 కోట్ల షేర్ సాధించడం విశేషం.
లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందనే లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఈ స్థాయి సక్సెస్ తో అప్పటి వరకూ డెబ్యూ రికార్డులను తిరగ రాస్తోందీ వైష్ణవ్ తేజ్ మూవీ. హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన డెబ్యూ హీరోగా రికార్డు సృష్టించబోతున్నాడు మెగా వారసుడు. ఈ నేపథ్యంలో తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న హీరోలు మరోసారి డిస్కషన్ లోకి వచ్చారు. వారి, వివరాలను కూడా ఓ సారి పరిశీలిస్తే…
మహేష్ః సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి సినిమా ‘రాజ కుమారుడు’తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ప్రిన్స్ కు మంచి విజయాన్ని అందించింది.
Also Read: క్రేజీ కాంబినేషన్ ఇక వచ్చే సంక్రాంతికే !
రామ్ చరణ్ః డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చాడు చెర్రీ. మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రం అప్పటి వరకూ ఉన్న వసూళ్ల రికార్డులను తిరగరాసింది.
తరుణ్ః తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నువ్వే కావాలి సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. లవ్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
అల్లు అర్జున్ః రాఘవేంద్రరావు డైరెక్షన్లో రూపొందిన ‘గంగోత్రి’ సినిమాతో తెరంగేట్రం చేశాడు బన్నీ. ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ ను నమోదు చేసింది.
నితిన్ః డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘జయం’ సినిమాతో పరిచయం అయ్యాడు నితిన్. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
సాయి ధరమ్ తేజ్ః పిల్లా నువ్వలేని జీవితం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు తేజు. ఏ.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. తేజూకు మంచి ఆరంభాన్నిచ్చింది.
విజయ్ దేవరకొండః పెళ్లి చూపులు సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్. అందరినీ అలరించిన ఈ మూవీ క్లాస్ హిట్ గా నిలిచింది.
రామ్ పోతినేనిః ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ కూడా మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్’ చిత్రం.. యూత్ ను తెగ ఆకట్టుకుంది.
నానిః నాచురల్ స్టార్ నాని ‘అష్టాచమ్మా’ చిత్రం ద్వారా హీరోగా ప్రవేశించాడు. ఈ చిత్రం సైలెంట్ హిట్ కొట్టింది.
రాజ్ తరుణ్ః షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రాజ్ తరుణ్.. ‘ఉయ్యాల.. జంపాల’ చిత్రం ద్వారా ఫ్యామిలీ హిట్ కొట్టాడీ హీరో.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్