Hero Venu Thottempudi : కామెడీ జానర్ లో రాజేంద్ర ప్రసాద్ తర్వాత తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకడు వేణు తొట్టెంపూడి. ‘స్వయంవరం’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసి, తొలి చిత్రం తోనే భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఆయన, ఆ తర్వాత ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’, ‘కళ్యాణ రాముడు’, ‘పెళ్ళాం ఊరెళ్ళితే’, ‘చెప్పవే చిరుగాలి’, ‘ఖుషి ఖుషీగా’, ‘శ్రీకృష్ణ 2006’, ‘యమగోల మళ్ళీ మొదలైంది’, ‘గోపి గోపిక గోదావరి’ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించిన ఆయన, ఆ తర్వాత అకస్మాత్తుగా సినిమాలకు దూరమై వ్యాపార రంగం లోకి అడుగుపెట్టాడు. ఇంతటి సక్సెస్ ఫుల్ కెరీర్ ఉన్నటువంటి ఒక హీరో, ఎందుకు ఈ రంగాన్ని వదిలేశాడని ఆయన అభిమానులు అనేక సందర్భాలలో అనుకున్నారు. కానీ సినీ ఇండస్ట్రీ లో ఆయనకి హీరోగా మార్కెట్ పోయిన తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా మారినప్పుడు, కొంతమంది దర్శకులు తనకి ఒక కథని చెప్పి, చివరికి తన క్యారక్టర్ ని పూర్తిగా మార్చేశారని, అందుకే సినిమా ఇండస్ట్రీ నుండి తప్పుకున్నానని చెప్పుకొచ్చాడు.
ఉదాహరణకు 2012 వ సంవత్సరం లో జూనియర్ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన దమ్ము చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజ్ గా నిల్చింది. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ముఖ్య పాత్ర పోషించాడు. అయితే డైరెక్టర్ బోయపాటి శ్రీను తనకి కథ చెప్పినప్పుడు హీరో తర్వాత సమానమైన పాత్ర అని, కథకి ఎంతో కీలకమైనది అని చెప్పి, చివరికి ప్రాముఖ్యత లేని పాత్ర ఇచ్చాడని, అందుకే అప్పటి నుండి ఏ క్యారక్టర్ పడితే ఆ క్యారక్టర్ చేయకూడదు అని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం వేణు అయన హీరో గా నటించే రెండు సినిమాలను పక్కన పెట్టాడట, కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ నష్టం వాటిల్లింది. ఇది ఇలా ఉండగా గతం లో అక్కినేని నాగార్జున, సుమంత్ కాంబినేషన్ లో ‘స్నేహమంటే ఇదేరా’ అనే చిత్రం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా సుమంత్ క్యారక్టర్ కి వేణు ని అనుకున్నారట.
రేపు షూటింగ్ అనగా, ఈరోజు సాయంత్రం నిర్మాత ఆర్బీ చౌదరీ ఆఫీస్ నుండి ‘మీరు ఈ సినిమా చేయడం లేదు. నాగార్జున గారు మీకు బదులుగా తన మేనల్లుడు సుమంత్ ని తీసుకున్నాడు’ అని చెప్పారట. దీనికి వేణు చాలా బాదపడినట్టు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. నాగార్జున గారి మీద అభిమానంతో ఒక సినిమాని వెనక్కి నెట్టి మరీ ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చాను, ఇప్పుడు అవన్నీ వృధా అయిపోయాయి. డబ్బులు నష్టపోయిన పర్వాలేదు కానీ, ఎంచుకున్న సినిమా నుండి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా తప్పించడం ఏమిటి అని వేణు తొట్టెంపూడి చాలా బాధ పడ్డాడట. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీ లో ఎన్నో జరిగాయట, అందుకే సినీ ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోయినట్టు చెప్పుకొచ్చాడు.