
అగ్రహీరో వెంకటేశ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నారప్ప’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి టాక్ అందుకున్న వేళ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.
సినిమాకు కథ ప్రధానం అని.. ఆ కథ కోసం పాత్రకు తగ్గట్టుగా మారిపోవడం తన నైజం అని వెంకటేశ్ అన్నారు. నారప్ప లాంటి ఎమోషనల్ కథ తనకు సూట్ అవుతుందో కాదో అని అందరూ భయపడ్డారని కానీ.. తాను మాత్రం కథ బలంగా ఉంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి వెనుకాడను అని స్పష్టం చేశారు.
నారప్ప సినిమాలో హీరో పాత్ర విధానం తనకు ఎంతగానో నచ్చిందని వెంకటేశ్ అన్నారు. కథ విన్నప్పుడు వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలిపారు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ ను ఎంతవరకు ఆమోదిస్తారన్న విషయంలో తనకు ఎలాంటి భయం కలుగలేదని క్లారిటీ ఇచ్చారు.
గతంలో చాలా సార్లు ఇలా కథను నమ్మి తీసిన చిత్రాలు భారీ హిట్స్ వచ్చాయని వెంకటేశ్ తెలిపారు. మొదట విమర్శలు వచ్చినా ప్రయోగాత్మక చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయన్నారు. ‘పవిత్ర బంధం’ సినిమా సమయంలో సౌందర్య కాళ్లు పట్టుకున్న పోస్టర్ అందరినీ షాక్ కు గురిచేసిందని.. ఆ సినిమా ఆడదన్నారని.. అగ్రహీరో హీరోయిన్ కాళ్లు పడితే సినిమా ఫ్లాప్ అన్నారని.. కానీ అది సంచలన విజయాన్ని అందుకుందన్నారు. సినిమాలో పాత్రలు కథకు తగ్గట్టుగా అందరికీ కనెక్ట్ అయితే ప్రయోగాలు ఎన్ని చేసినా కూడా ఏమీ కాదని వెంకటేశ్ వివరణ ఇచ్చాడు.