Karthikeya: ఆర్ఎక్స్ 100తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత వరుసగా విభిన్న కథాంశాలతో పలకరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఇటీవల రాజా విక్రమార్క సినిమాతో పలకరించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఇంకా థియేటర్లలో ఆడుతున్న ఈ సినిమా.. మంచి వసూళ్లు సాధిస్తోంది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తికేయ తన ప్రియురాలు లోహితను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ.. అందరి ముందు ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరిచారు.

ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా, వీరిద్దరి పెళ్లికి ముహూర్తం కూడా ఖరారైంది. నవంబరు21 ఆదివారం ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహిత-కార్తికేయ మూడుముళ్ల బంధంతో ఒకటవనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ ముహుర్తానికి సంబంధించి కార్తికే, లోహిత కుటుంబ సభ్యులు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.
2010లో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. వరంగల్ నిట్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా చిగురించింది. అయితే, 2018లో ఆర్ఎక్స్100తో పరిచయమైన కార్తికేయ. తన ప్రేమ గురించి ఎక్కడా ప్రస్థావించలేదు. ఈ ఏడాది ఆగస్టులో తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకుని.. ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం రాజా విక్రమార్క విజయంతో చిల్ అవుతున్నారు కార్తికేయ. మరోవైపు, అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న వలిమై సినిమాతో తమిళ ప్రజలకు పరిచయమవనున్నారు కార్తికేయ.