Harish Shankar: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత డైరెక్టర్ గా తొలిసినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా తట్టుకొని నిలబడిన డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar). మొదటి సినిమా ఆయన రవితేజ తో తీసిన ‘షాక్’ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్ళు దర్శకత్వం కి దూరమయ్యాడు. ఏ రవితేజ తో అయితే ఫ్లాప్ అందుకున్నాడో, అదే రవితేజతో ‘మిరపకాయ్’ చిత్రం చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు హరీష్ శంకర్. ఇక ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘గబ్బర్ సింగ్’ ఒక చరిత్ర. 2012 వ సంవత్సరంలోనే 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన సినిమా అది.
అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ మళ్ళీ అదే రేంజ్ సక్సెస్ ని అందుకోలేకపోయారు కానీ, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్ చిత్రాలతో టాలీవుడ్ లో మంచి కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషన్ ని తీసిన హారీష్ శంకర్, అదే పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagath Singh) చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసి దాదాపుగా 5 ఏళ్ళు అయ్యింది. షూటింగ్ ప్రారంభమై ఒక 30 శాతం వరకు పూర్తి చేసుకుంది కానీ, పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల మిగిలిన 70 శాతం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ గ్యాప్ లో ఆయన రవితేజ తో ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రాన్ని చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఒకవేళ ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యుంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఎదురు చూడకుండా, ఈపాటికి మరో సినిమా చేసుండేవాడు. కానీ ‘మిస్టర్ బచ్చన్’ చూసిన తర్వాత హీరోలు ఇతనితో సినిమా చేయడానికే భయపడిపోతున్నారు. ఫలితంగా ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో ఆయనకు నటించే ఛాన్స్ దక్కింది. ప్రముఖ హాస్య నటుడు సుహాస్ హీరో గా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ అనే చిత్రంలో హరీష్ శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాని హీరో రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఆయన పలు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా ఈపాటికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో కట్, యాక్షన్ చెప్తూ బిజీ గా ఉండాల్సిన హరీష్ శంకర్, ఇతర సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకోవాల్సిన పరిస్థితి. పాపం పవన్ కళ్యాణ్ ఇతనికి మోక్షం ఎప్పుడు కలిగిస్తాడో చూడాలి.