Gummadi Venkateswara Rao: తెలుగు సినిమా రంగంలో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు ఐదు దశాబ్దాలకు పైగా నటించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. అయితే, ఆయన జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. గుమ్మడి గారు రావికంపాడు లో పుట్టారు. కొల్లూరులో చదువుకున్నారు. గుమ్మడి గారికి నటుడిగా అంత గొప్ప పేరు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తెలుగు ఉచ్చారణ. ఆయనకు ఉచ్చారణ బాగా రావడానికి ఆయన తెలుగు మాస్టారు జాస్తి శ్రీరాములు గారు కారణమట. దగ్గర కూర్చోబెట్టుకుని గుమ్మడి గారికి తెలుగు నేర్పించారట.
ఇక గుంటూరు హిందూ కాలేజ్ లో ఇంటర్ చదువుతుండగా నాటకాలు వేయడం అలవాటు అయింది. కాకపోతే అప్పట్లో ఆయనకు నటన మీద కంటే కూడా.. కమ్యూనిస్టు భావజాలం పైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ ఓ నాటకంలో 17 ఏళ్ళకే ముసలి తండ్రి వేషంలో బెస్ట్ యాక్టర్ బహుమతి అందుకున్నారు.
అది చూసిన సీనియర్ శ్రీరంజని గారి కుమారుడు మల్లికార్జునరావు గుమ్మడి గారి నటన, రూపురేఖలు చూసి, మీరు తప్పక హీరో అవుతారు, అని ఎంకరేజ్ చేసి మద్రాస్ బాట పట్టించారు. మద్రాసులో ఎక్కే గుమ్మం దిగే గుమ్మం తప్ప అవకాశాలు రాలేదు. ఇక ఇంటికి వెళ్లిపోవాలి అని గుమ్మడి గారు నిర్ణయించుకున్నారు.
ఆ విషయం ఎన్టీఆర్ కి తెలిసింది. ఎన్టీఆర్ కూడా అప్పటికి హీరో కాలేదు. ఆయన సినిమా ప్రయత్నాల్లోనే ఉన్నారు. కానీ గుమ్మడిని ఆదుకున్నారు. ఎన్టీఆర్ రూంలో అప్పటికే రూమ్ మేట్స్ గా టి.వి.రాజు, డి.యోగానంద్ ఉండేవారు. తన ప్రక్క రూమ్ తక్కువ అద్దెలో గుమ్మడి గారికి ఎన్టీఆర్ గారు ఇప్పించారు.
ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి సాయం చేశారు. ఇక ఆ తర్వాత 1950లో డి.ఎల్. నారాయణ తీసిన అదృష్టదీపుడు తో మొదలైంది గుమ్మడి గారి సినీ ప్రస్థానం. 60 ఏళ్ళ పాటు కొనసాగింది ఆయన సిని జర్నీ. మధ్యలో గుమ్మడికి ఛాన్స్ లు రాకపోతే.. అప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహించింది ఎన్టీఆరే. తన సొంత బ్యానర్ ఎన్.ఎ.టి. సంస్థ తీసిన సినిమాల్లో గుమ్మడికి అద్భుతమైన పాత్రలిచ్చి ప్రోత్సహించారు. దానితో గుమ్మడి గారి ప్రతిభ వెలికొచ్చింది.