
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రజల నుంచి పలు అపవాదులు మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడు తన బిడ్డ కవిత ఎమ్మెల్సీగా గెలుపు కూడా మరో అపవాదును తీసుకొచ్చింది. సీఎం కూతురు అయి ఉండి ఓ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలవలేని తన బిడ్డను ఎమ్మెల్సీగా గెలిపించుకొని కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ చూస్తున్నారంట.
Also Read: తెలంగాణ పీజీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.?
అయితే.. గతంలో పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ మాజీ సీఎం చంద్రబాబు ఇలానే చేశాడు. కనీసం ఎమ్మెల్యేగా గెలిచే సత్తా లేని తన కొడుకు లోకేష్‌ను కష్టపడి ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాడు. చివరకు మంత్రిగా అవకాశం ఇచ్చాడు. దొడ్డిదారిన కొడుకుని ఎమ్మెల్సీగా గెలిపించుకుని మంత్రి పదవి ఇచ్చాడనే ఇమేజీ చంద్రబాబుపై ఉంది.
ఇప్పుడు కూతురు కవితను ఎమ్మెల్సీగా గెలిపించుకోవడంతో పాటు, మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. దీంతో టీఆర్ఎస్ కప్పులో మినీ తుఫాన్ చెలరేగుతుందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ పాలనపై అసంతృప్తి వెల్లువెత్తుతోంది. తెలంగాణలో కుటుంబపాలన నడుస్తోందనే విమర్శలూ ఉన్నాయి. గ్రామస్థాయి పనుల నుంచి భారీ ప్రాజెక్టు కాంట్రాక్ట్ వరకు అన్నీ కేసీఆర్ కుటుంబీకులు, బంధువులకే నిర్వహిస్తున్నారనే ఆరోపణలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి.. బంగారు తెలంగాణ అంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్, తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నారని ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో కూతురు కవితను కేబినెట్‌లోకి తీసుకుంటే కేసీఆర్‌కు అదనపు తలనొప్పులు తప్పవేమో.
Also Read: అన్ని కేసులు సీబీఐకి.. న్యాయం జరుగుతోందా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని ఆదరించిన తెలంగాణ ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కవితను మాత్రం తిరస్కరించారు. అప్పట్నుంచి ఇప్పటివరకు కూతుర్ని ఎలాగైనా లైమ్ లైట్‌లోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రత్యేక దృష్టి పెట్టి మరీ కవితను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. అదే స్పీడ్‌లో ఆమెను కేబినెట్‌లోకి కూడా తీసుకుంటారని అంటున్నారు. ఏకంగా హోం మంత్రినే చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్‌పై మరింత వ్యతిరేకత పెరగడం మాత్రం ఖాయం. మరీ ముఖ్యంగా మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీని తొలిగించి, ఆ పదవి కవితకు ఇస్తే కేసీఆర్‌కు అది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దొడ్డిదారిన కూతురిని మినిస్టర్ చేశారనే అపవాదును మాత్రం ఆయన జీవితాంతం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన కేసీఆర్.. గతంలో చంద్రబాబు చేసిన తప్పును చేయరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.