Silk Smitha: ఎన్ని విజయాలు సాధించినా ఎంత ఎత్తుకు ఎదిగినా పక్కన నమ్మకమైన వ్యక్తులు ఉండాలి. బాధలో ఓదార్చే తోడు అవసరం. నిజాయితీగా ప్రేమించే మనుషులు వెంట ఉండాలి. అలాంటి మద్దతు లేని నాడు ఎవరైనా అనాథల క్రిందే లెక్క. సిల్క్ స్మిత ప్రేమకు నోచుకోలేక తపించి మరణించింది. మానసిక ఒత్తిడికిలోనై తనువు చాలించింది. సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందు రోజు అనగా 22న ఆమె సుదీర్ఘ లేఖ రాశారు. సిల్క్ స్మిత పెద్దగా చదువుకోలేదు. వచ్చీరాని తెలుగులో వేదన వెళ్లగక్కారు.
పరోక్షంగా తన చావుకు కారణాలు వెల్లడించారు. ఈ లెటర్లో సిల్క్ స్మిత ముగ్గురు పేర్లు ప్రముఖంగా ప్రస్తావించారు. బాబు, రాము, రాధాకృష్ణల గురించి లేఖలో రాశారు. బాబు చాలా మంచివాడు. తన నుండి డబ్బు ఆశించకుండా మద్దతుగా నిలిచిన వ్యక్తిగా సిల్క్ స్మిత అతన్ని ఉద్దేశించి రాశారు. ఇక రాము, రాధాకృష్ణల మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ తనకు తీరని అన్యాయం చేశారని అన్నారు. వారిద్దరికీ నేను చాలా చేశాను. కానీ నాకు ద్రోహం చేశారు. దేవుడు వారిద్దరిని శిక్షించాలని ఆమె లేఖలో కోరుకున్నారు.
అలాగే మరొక వ్యక్తి గురించి కూడా ఆమె లేఖలో రాశారు. అయితే ఆయన పేరు బయటపెట్టలేదు. ఒకడు ఐదేళ్ల క్రితం నాకు జీవితం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు వాడు నన్ను దూరం పెట్టాడని అన్నారు. అంటే ఈ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని లేదా తోడు ఉంటానని ప్రామిస్ చేసి ఉంటాడని మనకు అర్థం అవుతుంది. ఇంకా ఆ లేఖలో సిల్క్ స్మిత అనేక విషయాలు ప్రస్తావించారు. ఏడేళ్ల వయసు నుండే పొట్టకూటికి కష్టపడ్డాను. చాలా మంది నా సొమ్ము తిన్నారు. నాకంటూ ఎవరూ లేరు.
రోజూ టార్చర్. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను, అని ఆమె లేఖలో రాశారు. కేవలం స్వార్థ ప్రయోజనాలకు దగ్గరైన మనుషులతో సిల్క్ స్మిత విసిగిపోయారనిపిస్తుంది. కష్టంలో ఓదార్చే ప్రేమించే వ్యక్తులు ఆమెకు లేకుండా పోయారు. లేఖలో సిల్క్ స్మిత ప్రస్తావించిన రాధాకృష్ణ ఆమె సెక్రటరీ. రాము ఎవరనేది తెలియదు. వీరు తన చావుకు కారణం అని సిల్క్ స్మిత రాయలేదు. అందుకే వాళ్లకు ఎలాంటి శిక్ష పడలేదు. ఇంటి నుండి పారిపోయి సౌత్ ఇండియాను ఏలిన సిల్క్ స్మిత మానసిక వేదనతో ప్రాణం తీసుకున్నారు.