RGV Biopic on Konda Murali: సంచలనం.. కొండా మురళిపై రాంగోపాల్ వర్మ బయోపిక్?

  ‘రక్త చరిత్ర’ను మించిన స్టోరీని పట్టుకున్నాడట వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటిదాకా సీమ ఫ్యాక్షనిజం.. బెజవాడ రౌడీయిజాన్ని చూపించిన వర్మ.. ఈ ఫ్యాక్షనిజం, కక్షలు, కార్పణ్యాలు లేని తెలంగాణ సమాజంపై పడ్డారు. ఇక్కడ నక్సలిజం మూలాలతో నాయకులుగా ఎదిగిన వారిపై సినిమాలు తీసే యోచనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాను ఊపు ఊపేసిన లీడర్.. ప్రజల్లోంచి వచ్చిన ఒక విప్లవ వీరుడి కథను సినిమాగా మలచాలని చూస్తున్నాడట.. అతడు ఎవరో కాదు.. ‘కొండా […]

Written By: NARESH, Updated On : August 20, 2021 6:47 pm
Follow us on

 

‘రక్త చరిత్ర’ను మించిన స్టోరీని పట్టుకున్నాడట వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటిదాకా సీమ ఫ్యాక్షనిజం.. బెజవాడ రౌడీయిజాన్ని చూపించిన వర్మ.. ఈ ఫ్యాక్షనిజం, కక్షలు, కార్పణ్యాలు లేని తెలంగాణ సమాజంపై పడ్డారు. ఇక్కడ నక్సలిజం మూలాలతో నాయకులుగా ఎదిగిన వారిపై సినిమాలు తీసే యోచనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాను ఊపు ఊపేసిన లీడర్.. ప్రజల్లోంచి వచ్చిన ఒక విప్లవ వీరుడి కథను సినిమాగా మలచాలని చూస్తున్నాడట.. అతడు ఎవరో కాదు.. ‘కొండా మురళి’.. అలియాస్ కొండా మురళీధర్ రావు.. ఎంతో ప్రజాదరణ పొందిన ఈయన చరిత్ర చూస్తే ఒళ్లు గగొర్పుడుస్తుంది. ప్రజా నేతగా పేరున్న ఈయన క్షేత్రస్థాయి నుంచి ఎంతోమందిని తట్టుకొని.. ఎదురించి ఎదిగారు. ఈ క్రమంలో మంచి పేరు తెచ్చుకున్నారు.

తెలంగాణ రెబల్ నేతల్లో ఒకరైన కొండా మురళి బయోగ్రఫీని తీసే పనిలో వివాదాస్పద దర్శకుడు వర్మ బిజీగా ఉన్నాడట.. విశేషం ఏంటంటే ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని.. ఈ సినిమాకు నిర్మాత ఏపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఏపీ వైసీపీ అనుకూల ఎమ్మెల్యే సినిమాను నిర్మిస్తుండడంతో  కొండా మురళి బయోపిక్ ఎవరిని టార్గెట్ చేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు భోగట్టా.

కొండా మురళి 1963 అక్టోబర్ 23న కొండా చెన్నమ్మ-కొమురయ్య పటేల్ దంపతులకు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి గ్రామంలో మున్నూరు కాపు సామాజికవర్గంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి విధేయత, నిబద్దత, విలువలే జీవితంగా బతికాడు. తనకు ఎదురువచ్చిన వారి అడ్డు తొలగించుకుంటూ రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. వ్యక్తిగత లాభాలు చూడకుండా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి కావడంతో ప్రజల్లో పిచ్చ పాపులారిటీ ఈయనకు ఉంది.

ప్రజల కోసం అన్యాయాలపై పోరు సాగించిన నేత కొండా మురళి. దళిత, పేదలకు కోసం నాయకులనే ఎదురించాడు. ఈ క్రమంలోనే వంచనగిరి గ్రామ సర్పంచ్ గా 1987లో తన రాజకీయజీవితాన్ని ప్రారంభించాడు. అలా ప్రారంభించి కొండా సురేఖను ప్రేమ వివాహం చేసుకొని ఈయన ఎమ్మెల్సీగా, కొండా సురేఖ మంత్రిగా వైఎస్ హయాంలో వెలుగు వెలిగారు. ఇప్పటీకీ వరంగల్ లో బలమైన నాయకులుగా ఉన్నారు.

ఎంతో రాజకీయ రక్త చరిత్రను సొంతం చేసుకున్న కొండా మురళి జీవితాన్ని రాంగోపాల్ వర్మ కథగా ఎంచుకొని బయోపిక్ తీయడానికి రెడీ కావడం నిజంగా సినీ, రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాంగోపాల్ వర్మ ఎంచుకున్న ఈ కథలో కొండా సురేఖ పాత్ర ఎంతో కీలకం. ఆమె పాత్రలో ఎవరిని ఎంచుకుంటారన్నది ఆసక్తికరం. ఎందుకంటే కొండా సురేఖను బలవంతంగానే మురళి పెళ్లి చేసుకున్నాడని టాక్. వీరి వివాదాస్పద పెళ్లిని మురళీ చూపిస్తారా? మురళి చరిత్రను పాజిటివ్ గా చూపిస్తారా? నెగెటివ్ గా చూపిస్తారా? అసలు కొండా మురళిని హీరోగా చూపిస్తారా? విలన్ గా చూపిస్తారా? అన్నది ఆసక్తికరం..

రక్తచరిత్రను రెండు పార్టులుగా తీసిన వర్మ.. కొండా మురళి చరిత్రను ఎన్ని పార్టులు తీస్తాడు? ఒకటే పార్ట్ లో తీస్తాడా? ఆయన అన్ని రాజకీయ, వ్యక్తిగత విషయాలను వర్మ టచ్ చేస్తాడా? కొండా మురళీ విషయాలన్నీ సినిమాలో చూపిస్తాడా? ఏ కోణంలో చూపిస్తాడా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

కావాల్సినంత మసాలా ఉన్న స్టోరీ కొండా మురళీది. అందులో కొండా సురేఖతో లవ్. అంతకుముందు రాజకీయ ఎదుగుదల.. ప్రత్యర్థులకు చెక్.. వైఎస్ హయాంలో రాజకీయాలను ఏలడం సహా ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉంది. అదంతా కళ్లకు కట్టినట్టు చూపిస్తే సినిమాపై ఖచ్చితంగా హైప్ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.