BRS KCR Kavitha : జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టారు. తన టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారుస్తూ ఈరోజు పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. దీనికి దక్షిణ భారతదేశంలోని వివిధ పార్టీల నేతలు, జేడీఎస్ నేత కుమారస్వామి.. ఉత్తరాది నుంచి రైతు సంఘాల నేతలు హాజరై సపోర్టు చేశారు.
ఇక ఉదయం వీరందరితో కేసీఆర్ ప్రగతి భవన్ లో అల్పాహారం తిన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు దగ్గరుండి మరీ వారికి టిఫిన్ పెట్టారు. దాదాపు 40 మంది వరకూ దేశవ్యాప్తంగా అతిథులు వచ్చారు. వారందరికీ కేసీఆర్ దగ్గురుండి మరీ భోజన సదుపాయం కల్పించారు.
ఇక ఆ తర్వాత వారందరినీ టీఆర్ఎస్ భవన్ కు తీసుకెళ్లి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చే కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయించి సరిగ్గా ముహూర్తం పెట్టిన 1.19 గంటలకు కేసీఆర్ సంతకం చేశారు.అనంతరం ఈసీకి ఈ లెటర్ ను పంపించనున్నారు.
టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారి తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే.. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డ.. ఆడ కూతురు అయిన కవిత మాత్రం ఈ వేడుకలో పాలుపంచుకోకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. తండ్రి అడుగుజాడల్లో కనిపించే కవిత..ఈసారి మిస్ అయ్యింది. విజయదశమి పూట కేసీఆర్ హారతి ఇచ్చి తిలకం దిద్డడం ప్రతీసారి కవితకు అలవాటు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఈ సందర్భాల్లో కవిత ఆ వేడుకలో కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడడం.. అందులో కవిత పేరు రావడంతో కేసీఆర్ , కేటీఆర్ లు ఇబ్బందుల్లో పడ్డారు. కవిత వల్ల తమ రాజకీయ భవిష్యత్ కు చెడ్డ పేరు వస్తుందని భావించినట్టున్నారు. అందుకే ఆమెను దూరం పెట్టినట్టుగా ప్రచారం సాగుతోంది. దీనిపై నిజనిజాలు బయటకు రావాల్సి ఉంది.