Eatela Rajender: ‘పగతో రగిలిపోతున్న బొమ్మాళీ’ అంటూ సినిమాలోని డైలాగ్ లా ఇప్పుడు కేసీఆర్ పై పగతో రగిలిపోతున్నారు ఈటల రాజేందర్.. ఆ పగను ఎలా తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. దీనికి ‘బెంగాల్’ ఫార్ములాను అప్లై చేయాలని భావిస్తున్నారు. అది సక్సెస్ అయితే మాత్రం తెలంగాణలో తిరుగులేని శక్తి అయిన కేసీఆర్ ఓడిపోవడం ఖాయం.
తెలంగాణలో తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి.. తన ఆస్తులపై విచారణ చేపట్టి.. చివరకు తను కొన్న భూములను సైతం రైతులకు పంచి.. ఎమ్మెల్యేగా ఓడించేందుకు శతవిధాల ప్రయత్నించిన కేసీఆర్ ను ఊరికే వదిలిపెట్టవద్దని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందుకే ప్రతీకారంతో రగిలిపోతున్న ఈటల రాజేందర్ ఏకంగా ఏనుగు కుంభస్థలాన్నే కొట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూరాబాద్ లో తనను ఓడించేందుకు కోట్లు కుమ్మరించిన గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడగొట్టేందుకు ఈటల రంగంలోకి దిగారు.
తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పై పోటీచేస్తానని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. ఇందుకోసం గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి నుంచే సీరియస్ గా వర్క్ చేస్తున్నానని ఈటల అన్నారు. తాను టీఆర్ఎస్ లో చేరింది కూడా గజ్వేల్ లోనే అని గుర్తు చేశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు అధికారి ఎలాగైతే ఓడించాడో అలాగే తెలంగాణలో తాను కేసీఆర్ ను ఓడిస్తానని ఈటల శపథం చేశారు.
తానే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేస్తానని.. పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉంటాయని ఈటల వెల్లడించారు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ ల నుంచి చేరికలను ప్రోత్సహిస్తానని.. ఆ బాధ్యత తీసుకొని కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తానని ఈటల సవాల్ చేశారు.
అయితే రెండు సార్లు పాలించిన వ్యతిరేకత టీఆర్ఎస్ పై పెల్లుబుకుతోంది. పైగా కేసీఆర్ కంచుకోట సిద్దిపేటను వదిలి తనకు అచ్చిరాని, అనువుగాని గజ్వేల్ లో గత సారి పోటీచేశాడు. కేవలం 25 వేల పైచిలుకు మెజార్టీ మాత్రమే సాధించాడు. అదే సిద్దిపేటలో పోటీచేసిన హరీష్ రావుకు లక్షకు పైచిలుకు మెజార్టీ వచ్చింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం అయినా కూడా కేసీఆర్ గజ్వేల్ లో తేలిపోయారు. ఈటల లాంటి సరైన అభ్యర్థి పోటీచేస్తే మాత్రం కేసీఆర్ ను ఓడించడం అసాధ్యం అయితే కాదు.
మొత్తంగా రాజకీయాల్లో దెబ్బతిన్నవాడు ఎప్పుడూ కసిగా ఉంటాడని ఈటల వ్యవహారంతో అర్థమవుతోంది. ఏకంగా కేసీఆర్ పై పోటీకి ఈటల సవాల్ చేయడం.. గజ్వేల్ లో క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం తిరుగుతుండడం చూస్తే టీఆర్ఎస్ లో గుబులు రేపుతోంది. మరి కేసీఆర్ గజ్వేల్ లోనే ఈటలతో తలపడుతాడా? లేక నియోజకవర్గాన్ని చేంజ్ చేసుకుంటాడా? అన్నది వేచిచూడాలి.