స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం పెద్ద వివాదం అయ్యింది. అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే అదనపు కమిషనర్ ఆ ఆదేశాలు జారీచేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కీలకమైన, సున్నితమైన విషయంలో ఉన్నతాధికారులను సంప్రదించకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంతా జరగడానికి అదనపు కమిషనర్ స్థాయిలో ఆదేశాలు ఇవ్వడమే కారణమని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: ఏపీలో రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్.. మార్పులు ఇవే!
తాజాగా దీనిపై దేవదాయశాఖ అదనపు కమిషనర్-2కు షోకాజు నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. కీలకమైన అంశంలో ఎవరికీ చెప్పకుండా సొంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ వివరణ కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కమిషనర్ తర్వాత స్థానంలో ఉండే అదనపు కమిషనర్‌కు షోకాజు నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి.
ఈనెల 18న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆలయ మర్యాద చేయాలంటూ పీఠం దేవదాయశాఖను కోరింది. దానికి స్పందించిన ఆ శాఖ అదనపు కమిషనర్-2 రామచంద్రమోహన్ కమిషనర్‌ను సంప్రదించకుండా రాష్ట్రంలోని 23 ఆలయాలకు ఆదేశాలు ఇచ్చారు.
రామచంద్ర మోహన్‌పై గతంలోనూ అనేక ఆరోపణలున్నాయి. సింహాచలం భూముల విషయంలో ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి. అలాగే మన్సాస్ ట్రస్టు ఈవోగా ఉన్నప్పుడు తూర్పుగోదావరిలో ట్రస్టు పరిధిలో ఉన్న భూముల్లోని ఇసుక తవ్వకా ల్లో అక్రమాలు జరిగాయని గతంలో దేవదాయశాఖ అధికారే లేఖ రాశారు.
ఈ క్రమంలోనే తాజా వివాదం వెలుగులోకి రావడం తో ఆయనపై కఠిన చర్యలే ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. జగన్‌కు స్వరూపానంద సన్నిహితంగా ఉంటారనేది తెలిసిన విషయమే. అయితే దేవదాయశాఖలోని కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని వ్యక్తిపూజకు ప్రాధాన్యమిస్తున్నారు.తరచూ శారదా పీఠానికి వెళ్ళడం, అక్కడి ఆశీస్సులు తమకున్నాయనే ప్రచారం చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వపెద్దలనూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
Also Read: కాంగ్రెస్ తో జగన్ పొత్తు.. ఊ కొడుతారా..? ఛీ కొడుతారా..?
ఈ వివాదం పై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఏపీ సీఎం జగన్ రోజుకో దుష్ట సంప్రదాయంతో రాష్ట్ర ప్రజల ప్రతిష్ట, లౌకిక విలువల్ని దిగజారుస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేతలు విమర్శిస్తున్నారు. జగన్ తన స్వామి భక్తి కోసం 5కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చటం కొందరూ అంటున్నారు.
దేవాలయాలు, స్వామీజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పాటించే సంప్రదాయాలకు ఈ ఆదేశాలు వ్యతిరేకమని అంటున్నారు. స్వరూపానందపై అంత ప్రేమ ఉంటే సొంత ఖజానా నుంచి కానుకలు ఇవ్వాలే తప్ప .. అధికార దుర్వినియోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చినజీయర్‌స్వామి, కంచి కామకోటి పీఠాధిపతిలాంటి ఇతర స్వామీజీల పుట్టినరోజులకు లేని మర్యాదలు స్వరూపానందకు చేయడం వారందరినీ కించపరచడమేనని విమర్శలు చేస్తున్నారు.