Gopichand: హీరో తొట్టెంపూడి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలివలపు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసినా ఆ సినిమా సరైన బ్రేక్ ఇవ్వలేదు. దీంతో ఆ తర్వాత విలన్‌గా మారాడు. తేజ దర్శకత్వం వహించిన జయం మూవీలో విలన్‌గా మంచి పేరు రావడంతో వరుసగా విలన్‌గా అవకాశాలు పలకరించాయి. దీంతో ప్రభాస్ వర్షం, మహేష్‌బాబు నిజం సినిమాల్లోనూ గోపీచంద్ విలన్‌గా నటించాడు.

అయితే హీరోగా అవకాశాలను మాత్రం పూర్తిగా పక్కన పెట్టలేదు. అలాంటి సమయంలో సొంత బ్యానర్‌లో యజ్ఞం సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా హిట్ కావడంతో అక్కడి నుంచి గోపీచంద్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. యజ్ఞం తర్వాత రణం, ఆంధ్రుడు వంటి సినిమాలు కూడా హిట్ అయ్యాయి. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన మొగుడు సినిమా తర్వాత గోపీచంద్ గ్రాఫ్ పడిపోయింది. మొగుడు సినిమా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా కావడంతో ఆ తర్వాత అన్ని అలాంటి అవకాశాలే రావడంతో వాటిని తిరస్కరించలేక గోపీచంద్ నటించాడు. దీంతో అతడిపై మూస హీరోగా స్టాంప్ పడింది.
Also Read: ఏపీలో జవహర్ రెడ్డిదే అంతా నడుస్తోందా?
ఇలా మొగుడు సినిమా అతడి కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. అయితే విలన్‌గా నటించినప్పుడు వచ్చిన పేరును హీరోగా నటించిన సమయంలో గోపీచంద్ కొనసాగించలేకపోయాడు. ఒకవేళ విలన్‌గానే మరికొన్ని సినిమాల్లో కొనసాగి ఉంటే అతడు ఈపాటికి స్టార్ హీరో అయ్యేవాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో లౌక్యం సినిమాను మినహాయిస్తే గోపీచంద్ కెరీర్‌లో పెద్ద హిట్లు లేవనే చెప్పాలి. త్వరలో మారుతి దర్శకత్వంలో రానున్న పక్కా కమర్షియల్ సినిమా అయినా గోపీచంద్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందేమో చూడాలి.

ఇక వ్యక్తిగత విషయానికి వస్తే గోపీచంద్ హీరో ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్. గోపీచంద్ తండ్రి టి.కృష్ణ కూడా దర్శకుడే కావడం విశేషం. ఈతరం ఫిలింస్ బ్యానర్ గోపీచంద్ హోం బ్యానర్. అతడి అన్నయ్య ప్రేమ్ చంద్ దర్శకుడు కావాలని కలలు కనేవాడు. కానీ అనుకోకుండా ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత గోపీచంద్‌పై పడటంతో సినీరంగ ప్రవేశం చేశాడని తెలుస్తోంది. 2013లో రేష్మను గోపీచంద్ వివాహం చేసుకున్నాడు. వీరి దంపతులకు విరాట్ కృష్ణ అనే ముద్దుల కుమారుడు ఉన్నాడు.
Also Read: బడ్జెట్ లేదు.. గిడ్జెట్ లేదు.. 94 వేల కోట్లు ఏమైపోయాయబ్బా?