Godfather OTT: ఆచార్య రిజల్ట్ తో డల్ అయిన మెగాస్టార్ చిరంజీవి నెలల వ్యవధిలో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. గాడ్ ఫాదర్ గా బాక్సాఫీస్ దుమ్ముదులిపారు. అక్టోబర్ 5 దీపావళి కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ భారీ విజయం నమోదు చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ లో బ్రహ్మ క్యారెక్టర్ లో చిరంజీవి అద్భుతం చేశారు. ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలు జోడించి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు. చిరు లుక్, మేనరిజమ్స్ ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. ఇది కదా మేము చిరు నుండి కోరుకుంటుందని అభిమానులు సంబరపడ్డారు.

ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గాడ్ ఫాదర్ కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 60 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కింది. అయితే చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లు సమూల మార్పులు చేశారు. ఒరిజినల్ లో మోహన్ లాల్ పాత్ర నిడివి గంట లోపే. గాడ్ ఫాదర్ లో రెండు గంటలకు పైగా చిరంజీవి స్క్రీన్ స్పేస్ పెంచారు. కొత్తగా ఓ పది పాత్రలు జోడించారు. దాదాపు స్ట్రెయిట్ మూవీగా గాడ్ ఫాదర్ తెరకెక్కింది.
నయనతార కీలక రోల్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నెగిటివ్ రోల్ చేయడం విశేషం. కాగా ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా నవంబర్ 19 నుంచి గాడ్ ఫాదర్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. గాడ్ ఫాదర్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి దక్కించుకున్నారు. గాడ్ ఫాదర్ ఓటీటీ స్ట్రీమింగ్ నేపథ్యంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమాన హీరో మూవీ బుల్లితెరపై చూసి ఎంజాయ్ చేస్తాం అంటున్నారు. మరి గాడ్ ఫాదర్ ఓటీటీలో ఎన్ని సంచలనాలు చేస్తుందో చూడాలి.

కాగా మరో రెండు నెలల్లో వాల్తేరు వీరయ్యగా చిరంజీవి థియేటర్స్ లో దిగనున్నారు. వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. రవితేజ కీలక రోల్ చేయడం విశేషం.