Geethanjali movie actress Girija Shettar: తెలుగు సినీ చరిత్రలో ‘గీతాంజలి’ ( Geethanjali movie) చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినీ లోకంలో విరబూసిన ఎన్నో మధురమైన ప్రేమకథల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమాగా ‘గీతాంజలి’కి ఒక స్పెషల్ క్రెడిట్ ఉంది. క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం కెరీర్ లోనే కూల్ సినిమాగా ఈ సినిమా నిలిచిపోయింది. ముఖ్యంగా నాగార్జున హీరోగా, గిరిజా శెట్టార్ (Girija Shettar) హీరోయిన్ గా తమ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
1989లో విడుదలైన ఆ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆ చిత్రం అంటే ఇష్టపడని యూత్ ఉండరంటే అతిశయోక్తి కాదు. పైగా జాతీయ స్థాయిలో కూడా ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు వచ్చాయి. అయితే, ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎన్ని రివార్డులు వచ్చినా ఈ సినిమాలో గిరిజా శెట్టార్ నటనకు సరితూగవు.
కేవలం ఒక్క సినిమాతోనే గిరిజా శెట్టార్ ఆ రోజుల్లో గొప్ప స్టార్ డమ్ తెచ్చుకుంది. అయితే, ఆమెకు ఎంత గొప్ప ఫాలోయింగ్ వచ్చినా.. ఆ తర్వాత ఎందుకో అలనాటి ఈ హీరోయిన్ ‘గీతాంజలి’ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో మరో సినిమా చేయలేదు. కాకపోతే కొన్ని మలయాళ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కాలంలో అసలు సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి.. పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.
ఇక పెళ్లి తర్వాత గిరిజా శెట్టార్ లండన్ వెళ్లిపోయింది. అయితే, లండన్ లో ఆమె ఏం చేస్తున్నారో తెలుసా? రచయితగా రాణిస్తున్నారు. 2005 నుంచి ఆరోగ్యం, మానవ సంబంధాల పై ఫ్రీలాన్స్ విలేకరిగా ఆమె వర్క్ చేస్తున్నారు. గొప్ప స్టార్ డమ్ ను వదిలిపెట్టి.. రచనలో తన జీవితాన్ని వెతుక్కోవడం నిజంగా విశేషమే.
ఇంతకీ గిరిజా శెట్టార్ కు పూర్తి పేరు ఏమిటో తెలుసా ? గిరిజా ఎమ్మా జేన్ శెట్టార్. ఆమెకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. పైగా సినిమాల్లో నటించాలి అనే ఆలోచన కూడా లేదు. మరి గీతాంజలి సినిమా ఆఫర్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా ? మణిరత్నం – సుహాసినిల పెళ్లికి ఆమె క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలితో కలిసి వెళ్లారు. తన పెళ్లిలోనే మణిరత్నం గిరిజను చూశారు. తన గీతాంజలి పాత్రకు ఆమె సూపర్ గా ఉంటుంది అని ఆమెకు ఆ సినిమా ఆఫర్ ఇచ్చారు.