BJP vs YCP: ఆంధ్రప్రదేశ్ లో పండుగల వేళ రాజకీయ దుమారం రేగుతోంది. సీఎం జగన్ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించొద్దంటూ ఆంక్షలు విధించడంతో బీజేపీ మండిపడుతోంది. ఎవరికి లేని ఆంక్షలు మాకెందుకని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే గుడ్ ఫ్రైడే, మొహర్రం లాంటి పండుగలు నిర్వహించుకున్నా వినాయక చవితిపై ఎందుకు పరిమితులు అంటూ నిలదీసింది. దీనిపై జగన్ పక్షపాత ధోరణి ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ, బీజేపీపై మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. పండుగల కోసం జగన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
దేశమంతా సంబరాల్లో మునిగే వేళ ఏపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. నవరాత్రుల కోసం భక్తులంతా ఎదురుచూస్తుండగా ప్రభుత్వం మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. దీనికి బీజేపీ నేతలు కూడా సరైన విధంగా కౌంటర్ ఇస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రత్యక్ష దాడికి దిగుతున్నారు. మాటలతో విరుచుకుపడుతున్నారు. హిందువుల పండుగలపై లేనిపోని ఆంక్షలు విధించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
కరోనా ప్రభావంతో రెండేళ్లుగా పండుగ జరుపుకోకపోవడంతో ఈ సారైనా ఘనంగా జరుపుకుందామని భావిస్తున్నా దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా మాట్లాడడం ఏమిటని ఎద్దేవా చేశారు. మూడో దశ ముప్పు ఉందన్న ఉద్దేశంతో ముందస్దు జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. కరోనా మళ్లీ విజృంబిస్తుందన్న నెపంతోనే పండుగ నిర్వహణపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ప్రభుత్వం సమీక్ష జరిపి పండుగ వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ర్టంలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతోంది. దీంతో పబ్లిక్ స్థలాల్లో వేడుకలు వద్దంటూ సూచనలు చేశారు. నిమజ్జనాలు వద్దని వారిస్తున్నారు. ఊరేగింపులకు అనుమతి లేదని చెబుతున్నారు. దీనిపై బీజేపీ నేతలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ పక్క స్కూళ్లు తెరిచినా పండుగలపై ఎందుకు ఈ వివక్ష అని అడుగుతున్నారు. ప్రజారోగ్యంపై మాకు మాత్రం పట్టింపు లేదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బీజేపీ, వైసీపీ నేతల మధ్య పండుగపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.