Game Changer Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మేనియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ ఇద్దరు కలిసినా ‘గేమ్ చేంజర్’ టికెట్స్ గురించే చర్చించుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే పలు చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైంది. మెజారిటీ స్థానాల్లో కేవలం బెనిఫిట్ షోస్ కి మాత్రమే బుకింగ్స్ ప్రారంభించారు. వీటికి రెస్పాన్స్ మామూలు రేంజ్ లో లేదు. 600 రూపాయిల రేంజ్ లో టికెట్ రేట్స్ పెడితే హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. దీనిని బట్టి రామ్ చరణ్ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బుక్ మై షో యాప్ లో అత్యధిక శాతం తెలంగాణ కి సంబంధించిన థియేటర్స్ ఉంటాయి. అంటే 70 శాతం తెలంగాణ బుకింగ్స్ ఉంటే, అందులో ఆంధ్ర ప్రదేశ్ కేవలం 30 శాతం మాత్రమే ఉంటుంది.
నేడు అడ్వాన్స్ బుకింగ్స్ ని కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే బెనిఫిట్ షోస్ తో ప్రారంభించారు. గంటకి 15 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. తెలంగాణ షోస్ లేకపోయినా ఈ రేంజ్ బుకింగ్స్ అంటే మామూలు విషయం కాదు. ప్రాంతాల వారీగా కేవలం బెనిఫిట్ షోస్ నుండి ఈ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము. కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతం లోని నాలుగు సెంటర్స్ నుండి ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయిలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది. ఇది ఒక సెన్సేషన్ అనే పదం చాలా చిన్నది అవుతుంది, అంతకు మించే అని చెప్పొచ్చు. అదే విధంగా నెల్లూరు జిల్లాలో 50 లక్షలు, కృష్ణ జిల్లాలో 22 లక్షలు, కర్ణాటక లో కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఈస్ట్ గోదావరి జిల్లాలో మాములుగా అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త నిదానంగా ఉంటాయి.
కానీ ‘గేమ్ చేంజర్’ కి మాత్రం బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే 60 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా అన్ని ప్రాంతాలకు కలిపి ఆంధ్ర ప్రదేశ్ లో 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. రేపు ఉదయం నుండి పూర్తి స్థాయి బుకింగ్స్ ప్రారంభం కాబోతుంది. ఇక రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ ఊచకోత ఏ రేంజ్ లో ఉండబోతుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రానికి ట్రేడ్ లో అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు వింటేజ్ శంకర్ సినిమా అని అంటున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ ఊచకోత మామూలు రేంజ్ లో ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.