మూవీ రివ్యూః గాలి సంప‌త్‌

మ‌హా శివ‌రాత్రి సినిమాల రాత్రి కూడా అయిపోయింది. ఇప్పుడు మూవీ రిలీజెస్ కు ఇది కూడా మంచి అకేష‌న్ గా మారిపోయింది. అందుకే.. ఈ సారి ఏకంగా మూడు చిత్రాలు ఒకే రోజున బ‌రిలో నిలిచాయి. వాటిలో ఒక‌టే ‘గాలి సంపత్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మిత్రుడు, రచయిత ఎస్.కృష్ణ రాసిన క‌థ ఇది. ఆయ‌నతోపాటు హ‌రీశ్ పెద్ది, సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాలో అనిల్ కూడా వాటాదారు. ‘అలా ఎలా?’ ఫేమ్ […]

Written By: K.R, Updated On : March 11, 2021 1:45 pm
Follow us on


మ‌హా శివ‌రాత్రి సినిమాల రాత్రి కూడా అయిపోయింది. ఇప్పుడు మూవీ రిలీజెస్ కు ఇది కూడా మంచి అకేష‌న్ గా మారిపోయింది. అందుకే.. ఈ సారి ఏకంగా మూడు చిత్రాలు ఒకే రోజున బ‌రిలో నిలిచాయి. వాటిలో ఒక‌టే ‘గాలి సంపత్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మిత్రుడు, రచయిత ఎస్.కృష్ణ రాసిన క‌థ ఇది. ఆయ‌నతోపాటు హ‌రీశ్ పెద్ది, సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాలో అనిల్ కూడా వాటాదారు. ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే.. ఈ సినిమాకు అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు అనిల్. నిర్మాత‌గా మారి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్యవేక్ష‌ణ చేయ‌డంతోపాటు స్క్రీన్ ప్లే కూడా అందించి, బ్యాక్ బోన్ లా నిలిచారు. మ‌రి, ఈ ‘గాలిసంప‌త్’ ఏం చేశాడన్నది చూద్దాం.

Also Read: శివ‌రాత్రి కాదు.. సినిమాల ‌రాత్రి.. వ‌చ్చేస్తున్న కొత్త సినిమాలు ఇవే!

కథః న‌ట‌కాలే జీవితంగా భావిస్తుంటాడు సంప‌త్‌(రాజేంద్ర ప్ర‌సాద్‌). వాటి ద్వారా సినిమా యాక్ట‌ర్ కావాల‌నేది ఆయ‌న గోల్‌. అయితే.. ఊహించ‌కుండా ఓ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. దాంతో.. గొంతుకు గాయ‌మైపోయి మాట పోతుంది. అయిన‌ప్ప‌టికీ.. మూకాభిన‌యంతో నాట‌కాలు కొన‌సాగిస్తూనే ఉంటాడు. అయితే.. ఆయ‌న కొడుకు సూరి(శ్రీ విష్ణు)తో నిత్యం గొడ‌వే. తండ్రి తెలియ‌క చేసిన కొన్ని ప‌నుల వ‌ల్ల ఇబ్బందులు ప‌డే సూరి.. ఆయ‌న‌పై మ‌రింత కోపం పెంచుకుంటాడు. కానీ.. కొడుకంటే తండ్రికి చాలా ఇష్టం. మ‌రి, వీరి మ‌ధ్య అపార్థాలు ఎలా తొల‌గిపోతాయి? సంప‌త్ సినిమాల్లోకి వెళ్లాడా? వీరి జీవితం ఇంకా ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అనేది మిగ‌తా క‌థ‌.

క‌థ‌నంః నిజానికి తండ్రీ కొడుకుల క‌థాంశంతో చాలా సినిమాలు వ‌చ్చాయి. అందులో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాయి. అయితే.. పూర్తి భిన్న‌మైన సినిమా. ట్ర‌క్ డ్రైవ‌ర్ గా ప‌నిచేసే కొడుకు సూరి.. ఎలాగైనా ఓన‌ర్ కావాల‌ని ఆశప‌డుతుంటాడు. ఇందుకోసం బాగా క‌ష్ట‌ప‌డుతుంటాడు. బ్యాంక్ లోన్ తీసుకొని బండి కొనాల‌ని చూస్తుండ‌గా.. తండ్రి వ‌ల్ల అది చేజారిపోవ‌డంతో ఇంకా ద్వేషం పెంచుకుంటాడు. ఈ విధంగా వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ మ‌రింత‌గా పెరిగిపోతుంది. అయిన‌ప్ప‌టికీ.. కొడుకుపై సంప‌త్ కు చాలా ప్రేమ‌. అయితే.. నాట‌కాల పేరుతో ప‌నీపాటా లేకుండా తిరుగుతున్నాడ‌ని తండ్రిపై కొడుక్కి కోపం. అయినా.. త‌న ప‌ద్ధ‌తి మార్చుకోడు సంప‌త్‌. ఈ క్ర‌మంలో గొంతు కోల్పోయిన‌ప్ప‌టికీ.. ఫీఫీపీ అంటూ మూకీ లాంగ్వేజ్ తో త‌న‌ అభిన‌యం కొన‌సాగిస్తూనే ఉంటాడు. ఒకే ఇంట్లో ఉంటున్న‌ప్ప‌టికీ.. ఒక‌రినొకరు అర్థం చేసుకోక‌పోతే పోతే ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నేది ఈ చిత్రం ద్వారా చ‌క్క‌గా చూపించారు.

Also Read: RRR రిలీజ్ సంక్రాంతికా..? మ‌హేష్‌-ప‌వ‌న్ ఏం చేస్తారు?

విశ్లేష‌ణః కామెడీ విష‌యంలో రాజేంద్ర‌ప్ర‌సాద్ స్థాయి ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న సినీ జీవిత‌మే హాస్య‌ర‌సభ‌రితం. అయితే.. ఇలా మూకీ పాత్ర‌లో న‌టించ‌డం బ‌హుశా ఇదే మొద‌టి సారి కావొచ్చు. అయిన‌ప్ప‌టికీ.. గాలి సంప‌త్ పాత్ర‌లో ఆయ‌న‌ ఒదిగిపోయారు. మూకీ అభిన‌యంలో ఎంతో నేర్పును ప్ర‌ద‌ర్శించారు. ఆయ‌న అనుభ‌వం ముందు అది స‌మ‌స్యే కాలేదు. త‌న మ‌న‌సులో ఏం చెప్పాల‌నుకుంటున్నారో ఇత‌రుల‌కు సింపుల్ గా అర్థం చేయించారు. ఈ సినిమాకు ఆయనే అసెట్‌. ఇక‌, హీరో శ్రీవిష్ణు.. హృద్య‌మైన న‌ట‌నలో ఆరితేరిపోయాడు. మొద‌ట తండ్రిని అపార్థం చేసుకునే కొడుకుగా.. ఆ త‌ర్వాత తండ్రిని ఆరాధించే కుమారుడిగా చ‌క్క‌గా న‌టించాడు. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే భావోద్వేగ‌మైన సంభాష‌ణ‌లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. వారి ఎమోష‌న్ ను ఎలివేట్ చేయ‌డంలో మాట‌లు కీల‌క పాత్ర పోషించాయి. వీరితోపాటు స‌త్య‌, సురేంద్ర రెడ్డి, శ్రీనివాస రెడ్డి ప్రేక్ష‌కులను న‌వ్వించారు కానీ.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. హీరోయిన్ ల‌వ్ లీ సింగ్ బ్యూటీ ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది త‌ప్ప‌, ఆమె పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. మిర్చి కిర‌ణ్‌, భ‌ర‌ణి, ర‌ఘుబాబు, క‌రాటే క‌ళ్యాణి, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రులు త‌మ ప‌రిధి మేర న‌టించారు. ఇక సినిమాటోగ్ర‌ఫీ, సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. అర‌కులు అందాల‌ను సాయిశ్రీరామ్ అద్భుతంగా ఆవిష్క‌రిస్తే.. అచ్చు రాజ‌మ‌ణి అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. సినిమాలో పాట‌ల‌క‌న్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అయితే.. కొన్ని స‌న్నివేశాల్లో కామెడీ మ‌రీ అరాచ‌కంగా సాగిపోతుంది. హీరోయిన్ తండి విష‌యం.. ఆమె త‌ల్లి జ‌డ‌ల వీక్నెస్‌, శ్రీకాంత్ అయ్యంగార్ బిహేవియ‌ర్ మ‌రీ కృత్రిమంగా అనిపిస్తాయి. హీరో హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ పండే స‌న్నివేశాల్లోనూ అంతగా ఫీల్ క‌నిపించ‌దు. కామెడీ సినిమా కాబ‌ట్టి అడ్జెస్ట్ అయితే ప‌ర్లేదు.. లేదంటే మాత్రం ఇబ్బందులు త‌ప్ప‌వు.

బ‌లాలుః రాజేంద్ర ప్ర‌సాద్ న‌ట‌న‌, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌, సంభాష‌ణ‌లు

బ‌ల‌హీన‌త‌లుః బ‌ల‌హీన‌మైన క‌థ‌నం, కొన్ని స‌న్నివేశాలు

రేటింగ్: 2.25

లాస్ట్ లైన్ః ‘గాలి‘స‌రిగా నింప‌లే..!

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్