టిక్ టాక్ ద్వారా స్టార్ అయిపోయాను అని భావించిన భార్గవ్ అనే కుర్రాడు అవకాశాలిప్పిస్తానంటూ ఓ మైనర్ బాలిక పై అత్యాచారం చేసి ఆమెను తల్లిని చేయడంతో అందరూ షాక్ కి గురి అయ్యారు. ఫన్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ భార్గవ్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దాంతో ఇతనితో సన్నిహితంగా మెలిగిన వారంతా ఇప్పుడు బాధ పడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఫన్ బకెట్ అనే పేరుని భార్గవ్ ముందు వాడటం వల్ల.. తమకు అలాగే తమ సంస్థకు బ్యాడ్ నేమ్ వస్తోందని దయచేసి భార్గవ్ పేరు ముందు ఫన్ బకెట్ అనే పదాన్ని వాడొద్దంటూ ఫన్ బకెట్ బృందం మొర పెట్టుకుంది.
ఈ సందర్భంగా ఫన్ బకెట్ టీం మాట్లాడుతూ.. ఫన్ బకెట్ లో నటించి పేరు తెచ్చుకుని ఆ తరువాత సినిమాల్లోకి, బిగ్ బాస్‌లోకి వెళ్లిన వాళ్లు కూడా ఉన్నారు. ఎంతోమందికి ఫన్ బకెట్ జీవితాన్ని ఇచ్చింది. అందుకే మేము ఈ ప్రోగ్రామ్ ను చాలా గౌరవంగా చూస్తాము. అలాంటిది భార్గవ్ అనే రేపిస్ట్ పేరు ముందు ఫన్ బకెట్ అని రాయడం మాకు చాలా ఇబ్బందులను అవమానాలను కలిగిస్తోంది. ఫన్ బకెట్ భార్గవ్ రేప్ చేశాడు అని రాయడం వల్ల మాకు అన్నం పెడుతున్న మా సంస్థకి ఉన్న మంచి పేరు పోతుందేమో అని మాకు భయంగా ఉంది.
వాస్తవంగా మాట్లాడుకుంటూ ఫన్ బకెట్ స్టార్ట్ చేసి ఐదేళ్లు పూర్తి అయింది. దాదాపు 280 ఎపిసోడ్స్ చేయడం జరిగింది. ఇందులో భార్గవ్ అనే అతను దాదాపు 200 ఎపిసోడ్స్ లో లేడు. అంటే మా ఫన్ బకెట్ లో అతని పాత్ర ఎంత అనేది మీరు అర్ధం చేసుకోవచ్చు. పైగా అతనికి మా ఫన్ బకెట్ కి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. నిజానికి భార్గవ్ మా ఫన్ బకెట్ లో మానేసి నాలుగేళ్లు అయిపోయింది. పైగా ఈ నాలుగేళ్లల్లో అతనితో మా ఫన్ బకెట్ టీమ్ అసలు కాంటాక్ట్ లోనే లేదు.
కనీసం ఫోన్ కాల్స్ లో కూడా మేము అతనితో టచ్ లో లేము. అందుకే మా ఫన్ బకెట్ ముందు అతని పేరు చూస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక వ్యక్తి వ్యక్తిగత ఇష్యూని మా బ్రాండ్ కి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ ? దయచేసి అతని పేరు ముందు ఫన్ బకెట్ అని రాయొద్దు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు సహకరించగలరు’ అంటూ ఫన్ బకెట్ టీమ్ తమ గోడును వినిపించారు. అలాగే ఈ భార్గవ్ పక్కన నటించిన అమ్మాయిలు కూడా అతని చేతిలో మోసపోయింది మేము కాదు అంటూ బయటకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.